డైమండ్..! చీర, గాజులు పంపించు -లోకేష్
గతంలో పవన్ కల్యాణ్, మంత్రి రోజాపై విమర్శలు చేస్తూ ఆమెను డైమండ్ రాణి అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేష్ కూడా ఆమెను డైమండ్ అంటూ పేరెత్తకుండానే ఎగతాళి చేశారు.
యువగళం తొలిరోజు కుప్పంలో జరిగిన బహిరంగ సభలో నారా లోకేష్ గొంతు కాస్త పెంచారు. ఘాటుగానే ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మంత్రి రోజాపై పరోక్షంగా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు చీర గాజులు పంపిస్తానని ఒక మహిళా మంత్రి చెప్పారని, ఆవిడ ఎవరో మీకు తెలుసు కదా.. డైమండ్..! డైమండ్..! అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఆవిడ తనకు చీర, గాజులు పంపిస్తానందని, అంటే చీర కట్టుకుని, గాజులు వేసుకునేవారంతా అంత చేతగానివాళ్లా అని నిలదీశారు లోకేష్. మహిళా మంత్రి అయి ఉంది అలా మాట్లాడటానికి నోరెలా వచ్చిందన్నారు. తనకు చీర, గాజులు పంపిస్తే వాటిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చి వారి కాళ్లు మొక్కుతానన్నారు లోకేష్. మంత్రి రోజా పేరెత్తకుండానే విమర్శలు చేశారు.
తల్లి చెల్లిని బయటకు గెంటేయను..
మంత్రులు ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకోవాలని హితవు పలికారు నారా లోకేష్. తల్లి చెల్లి అంటే తనకు గౌరవం ఉందని, అందుకే వారి కాళ్లకు మొక్కుతానని చెప్పారు. మీ నాయకుడిలాగా తాను తల్లి, చెల్లిని మెడబట్టి బయటకు గెంటేయను అని అన్నారు.
గతంలో పవన్ కల్యాణ్, మంత్రి రోజాపై విమర్శలు చేస్తూ ఆమెను డైమండ్ రాణి అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేష్ కూడా ఆమెను డైమండ్ అంటూ పేరెత్తకుండానే ఎగతాళి చేశారు. అప్పట్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో కౌంటర్లు పడ్డాయి. అయితే ఇప్పుడు లోకేష్ సెటైర్లకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఉదయం నుంచి లోకేష్ యాత్ర మొదలైన తర్వాత వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో స్పందన వచ్చింది. ఇప్పుడు లోకేష్ ప్రసంగం తర్వాత ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.