కర్నూలుకి బెంచ్.. హామీ ఇచ్చిన లోకేష్..
వైసీపీ ఏకంగా హైకోర్టునే ఇస్తానంది, కానీ టీడీపీ ఓ బెంచ్ ని మాత్రమే ఇస్తానంది. ఇక్కడ న్యాయవాదులు పొంగిపోవాల్సిన అవసరమేమీ లేదు. కానీ టీడీపీ అనుకూల న్యాయవాదులు ఈ హామీతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు.
కర్నూలుకి హైకోర్టు తరలి వస్తుందని, ఏపీకి కర్నూలు న్యాయ రాజధాని అవుతుందని చెప్పారు సీఎం జగన్. విశాఖ కాపురానికి వెళ్తానంటున్నారు కానీ.. లాయర్లు, జడ్జిల కాపురాలన్నీ కర్నూలుకి మారిపోతాయని మాత్రం ఆయన కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
ఏపీ హైకోర్టు ఎక్కడ ఉండాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అంటూ కేంద్రం క్లారిటీ ఇస్తున్నా, నాలుగేళ్లుగా అమరావతి నుంచి హైకోర్టు కదల్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కోర్టుని కదిలించే ప్రయత్నమూ చేయలేదు. అయితే తాము వైసీపీలా కాదని, మాట తప్పం, మడమ తిప్పం అని హామీ ఇచ్చారు నారా లోకేష్. టీడీపీ అధికారంలోకి రాగానే కర్నూలుకి హైకోర్టు బెంచ్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
వైసీపీ ఏకంగా హైకోర్టునే ఇస్తానంది, కానీ టీడీపీ ఓ బెంచ్ ని మాత్రమే ఇస్తానంది. ఇక్కడ న్యాయవాదులు పొంగిపోవాల్సిన అవసరమేమీ లేదు. కానీ టీడీపీ అనుకూల న్యాయవాదులు ఈ హామీతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. హామీ ఇచ్చిన లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ యువగళం యాత్రకు సంఘీభావం తెలిపారు. బెంచ్ వార్త టీడీపీ అనుకూల మీడియాలో హైలెట్ అవుతోంది.
ప్రస్తుతం లోకేష్ యువగళం యాత్ర కర్నూలులో కొనసాగుతోంది. కొత్త కొత్త హామీలు, కొత్త కొత్త పథకాలపై లోకేష్ పెద్దగా దృష్టి పెట్టడంలేదు. వైసీపీ నేతలపై విమర్శలతోనే సరిపెడుతున్నారు. అయితే కర్నూలు జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్న సందర్భంలో లోకేష్.. హైకోర్ట్ బెంచ్ హామీ ఇచ్చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా బెంచ్ ఇచ్చేస్తామన్నారు. ఏకంగా హైకోర్టు తరలించేస్తామని చెప్పుకున్న వైసీపీ నాలుగేళ్లుగా సైలెంట్ గా ఉందని, తాము మాత్రం బెంచ్ ఇచ్చేది పక్కా అని తేల్చేశారు.