Telugu Global
Andhra Pradesh

ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ - లోకేష్ హామీ

మహిళల కోసం ప్రత్యేక బ్యాంక్ లు ఏర్పాటు చేస్తున్నట్టే ముస్లింలకోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు నారా లోకేష్. పేద ముస్లింలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.

ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ - లోకేష్ హామీ
X

పాదయాత్రలో నారా లోకేష్ సరికొత్త హామీలతో ముందుకెళ్తున్నారు. యువగళం యాత్రలో భాగంగా ఆయన తిరుపతి జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. చంద్రగిరిలో ముస్లింలతో సమావేశమైన లోకేష్.. కేవలం ముస్లింలకోసం ఓ బ్యాంక్ నెలకొల్పుతామని మాటిచ్చారు. ఇస్లామిక్ బ్యాంక్ పేరుతో కార్యకలాపాలు మొదలుపెడతామన్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ కి కార్యాచరణ మొదలవుతుందని హామీ ఇచ్చారు లోకేష్.

మహిళల కోసం ప్రత్యేక బ్యాంక్ లు ఏర్పాటు చేస్తున్నట్టే ముస్లింలకోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు నారా లోకేష్. పేద ముస్లింలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేశారని.. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం దగ్గరపడిందన్నారు. చంద్రబాబు తిరిగి సీఎం కాగానే గతంలో ఇచ్చిన విధంగానే రంజాన్‌ తోఫా, దుల్హన్‌, విదేశీ విద్య సహా అన్ని రకాల సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని లోకేష్ తెలిపారు.

పాదయాత్రలో భాగంగా కొన్నిచోట్ల యువతతో కలసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు నారా లోకేష్. రాజకీయాల్లో యువత ప్రధాన భూమిక పోషించాలని పిలుపునిస్తున్నారు. ఆమధ్య జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తానని చెప్పి కలకలం సృష్టించిన లోకేష్, తాజాగా ఇస్లామిక్ బ్యాంక్ హామీతో మరోసారి వార్తల్లోకెక్కారు. అటు వైసీపీ నుంచి మాత్రం కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. లోకేష్ పాదయాత్ర ముగిసేలోపు టీడీపీ తడిగుడ్డ వేసుకోవడం ఖాయమంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామంటూ లోకేష్ పాదయాత్రలో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.

First Published:  2 March 2023 4:21 PM IST
Next Story