కేసీఆర్ సర్కార్ పనితీరు భేష్.. కితాబిచ్చిన లోకేష్
సీఎం జగన్, దక్షిణాఫ్రికాని ఆదర్శంగా తీసుకుని ఏపీలో మూడు ముక్కలాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు నారా లోకేష్. రాజధాని రైతులు అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ పనితీరుని మెచ్చుకున్నారు నారా లోకేష్. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో తెలంగాణతో పోలికలు చెబుతూ ఆయన కేసీఆర్ సర్కారుకి కితాబిచ్చారు. 'అమరావతి ఆక్రందన' పేరుతో తాడికొండ నియోజకవర్గంలోని రావెల గ్రామంలో జరిగన సభలో లోకేష్ పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
లోకేష్ ఏమన్నారంటే..?
"ఏపీలోని న్యూస్ పేపర్లలో నిత్యం హత్యలు, అత్యాచారాలు, కబ్జాలు, దాడుల వార్తలే కనిపిస్తున్నాయి. తెలంగాణ పేపర్లలో నిత్యం పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమ వార్తలు ఉంటున్నాయి. ఏపీలోని పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య సీఎం జగన్ చిచ్చు పెడుతున్నారు. హైదరాబాద్‌లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా? కర్ణాటకకు ఫాక్స్ కాన్ కంపెనీని మతం తీసుకెళ్లిందా? తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి.. మిగతవారికి న్యాయం చేస్తారా? అమరావతిలో ఆపేసిన పనులన్నీ మేం వచ్చాక మళ్లీ ప్రారంభిస్తాం. అమరావతి రైతులు మరో 9 నెలలు ఓపిక పట్టాలి." అంటూ లోకేష్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలికని చెప్పారు. తెలంగాణ పారిశ్రామికంగా ముందంజలో ఉందని, ఏపీ నుంచి కూడా కంపెనీలు తెలంగాణకు తరలిపోతున్నాయని దెప్పిపొడిచారు.
Day-183: అమరావతి ఆవేదన... రాజధాని రైతులతో ముఖాముఖి.https://t.co/Q6GXMbfX8F
— Lokesh Nara (@naralokesh) August 13, 2023
జగన్ కి దక్షిణాఫ్రికా ఆదర్శం..
సీఎం జగన్, దక్షిణాఫ్రికాని ఆదర్శంగా తీసుకుని ఏపీలో మూడు ముక్కలాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు నారా లోకేష్. రాజధాని రైతులు అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణను చేసి చూపించారని, కానీ జగన్.. ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టి, ఎన్నికల తర్వాత మాట తప్పారని, మడమ తిప్పారని విమర్శించారు. 3 రాజధానులు అంటున్న జగన్ ఎక్కడైనా ఒక్క ఇటుక వేశారా..? అని ప్రశ్నించారు. హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని ప్రధాన న్యాయమూర్తిని ఎప్పుడూ ప్రభుత్వం అడగలేదని గుర్తు చేశారు. అదే సమయంలో పాలనా రాజధాని పేరుతో విశాఖ ప్రజలను కూడా జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు లోకేష్.