పాదయాత్రపై లోకేష్ తొందరపడ్డారా..?
టీడీపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. లోకేష్ యాత్రపై ప్రజల్లో ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదని.. ఎంతవరకని బలవంతంగా తీసుకురాగలమని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర విషయంలో తొందరపడ్డారా? అన్న చర్చ నడుస్తోంది. లోకేష్ పాదయాత్రకు కనీస స్పందన లేకపోవడంపై టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీకి విపరీతమైన ఊపు వచ్చిందన్నభావన మొన్నటి వరకు ఉండేదని.. లోకేష్ పాదయాత్ర కారణంగా అదేమీ లేదన్న భావన ప్రజల్లో తిరిగి ఏర్పడుతోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
లోకేష్ పాదయాత్రకు కనీస స్పందన లేదని టీవీ9 లాంటి మీడియా సంస్థలు కూడా ప్రచారం చేయడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. తనసొంత జిల్లాలోనే తన కుమారుడి యాత్రకు కనీస స్థాయిలో జనసమీకరణ చేయకపోవడం పట్ల నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
జన స్పందన లేకపోవడంతో మంగళవారం లోకేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తన బస్సులోనే ఉండిపోయారు. దాంతో బుధవారం చంద్రబాబు పార్టీ నేతలకు టెలికాన్ఫరెన్స్‌లో క్లాస్ తీసుకున్నారు. గుర్తుండిపోయేలా చేయాలనుకున్న పాదయాత్రకు కనీస స్పందన తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలాంటి నాయకులను నమ్ముకుని ఎన్నికల్లో ఎలా బాధ్యతలు అప్పగించాలి అని ప్రశ్నించారు. పరోక్షంగా జన సమీకరణ చేయని పక్షంలో టికెట్లు దక్కవన్న సంకేతాలు ఇచ్చారు. ఒక దశలో మీ మొహాలే నాకు చూపకండి అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు.
టీడీపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. లోకేష్ యాత్రపై ప్రజల్లో ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదని.. ఎంతవరకని బలవంతంగా తీసుకురాగలమని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ ఇలా అతిఆత్మవిశ్వాసంతో నేరుగా సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించడం కంటే.. చిన్నచిన్నయాత్రలు చేసి ఉంటే జన స్పందన ఎలా ఉంటుంది అన్న దానిపై ఒక అవగాహన వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా నేరుగా సుదీర్ఘ పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించి ఇరుక్కుపోయారని వ్యాఖ్యానిస్తున్నారు.