అప్పుడెందుకు ఓడిపోయానంటే..? లోకేష్ బహిరంగ లేఖ
తనపై కేలు పెట్టారని, తన తండ్రిని జైలులో పెట్టారని.. బహిరంగ లేఖలో కాస్త సెంటిమెంట్ కూడా జోడించారు నారా లోకేష్.
ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ, నారా లోకేష్ మంగళగిరి ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆత్మస్తుతి, పరనింద మినహా ఇంకేమీ లేకపోయినా ఈసారి గెలిపించండి ప్లీజ్ అంటూ ఆయన వేడుకున్న విధానం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. పేదరికం లేని మంగళగిరి తన కల అని చెప్పుకొచ్చారు నారా లోకేష్. మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లు అని, ఈసారి మంగళగిరి ప్రజల హృదయాలు గెలుస్తానని అన్నారు.
అప్పుడెందుకు ఓడిపోయానంటే..?
2019 ఎన్నికల్లో తాను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు తనకు ప్రచారానికి కేవలం 23 రోజులు మాత్రమే సమయం ఉందని చెప్పారు నారా లోకేష్. ఇక్కడ పరిస్థితులను అర్ధం చేసుకునే లోపే ఎన్నికల సంగ్రామం ముగిసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందానన్నారు. ఓడిపోయిన రోజు బాధపడినా మరుసటి రోజు నుంచే మంగళగిరి ప్రజలతో మమేకమయ్యానని వివరించారు. ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని, యువగళం పాదయాత్ర ప్రారంభించకముందే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేశానని చెప్పారు. ప్రతి గడప తొక్కానని, నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్నానని అన్నారు.
తనపై కేలు పెట్టారని, తన తండ్రిని జైలులో పెట్టారని.. బహిరంగ లేఖలో కాస్త సెంటిమెంట్ కూడా జోడించారు నారా లోకేష్. 25 ఏళ్లు నియోజకవర్గాన్ని పాలించిన రెండు కుటుంబాలు ఏం చేశాయో ప్రజలు ఆలోచించాలన్నారాయన. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పత్తాలేకుండా పోతే నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉన్నానన్నారు. మంగళగిరి ప్రజలు తన కుటుంబసభ్యులు అనుకొని సేవలందించానని, చిరువ్యాపారులకు తోపుడుబళ్లు మొదలుకొని పెళ్లికానుకల వరకు, వీధుల్లో సిమెంటు బల్లలు, రోడ్లనిర్మాణం, తాగునీటి ట్యాంకర్ల వరకు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. అధికారంలో లేకపోతేనే ఇంత చేస్తే, ఇక ఎమ్మెల్యేగా తనని ఎన్నుకుంటే ఇంకెంత చేస్తానో ఊహించండి అంటూ ఊదరగొట్టారు. ఈసారి ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని మంగళగిరివాసుల్ని అభ్యర్థించారు లోకేష్.
లోకేష్ రాసిన లేఖలో కనీసం గెలుపు ధీమా లేకపోవడం విశేషం. మంగళగిరిలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న బీసీ మహిళా అభ్యర్థికి స్థానికుల మద్దతు ఎక్కువగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ దశలో లోకేష్ కి కంటిమీద కునుకు ఉండటం లేదు. అందుకే తన ఆవేదనంతా ఈ లేఖ రూపంలో బయటపెట్టారాయన.