మంగళగిరి నాదే రాసిపెట్టుకోండి -లోకేష్
మంగళగిరి ప్రజలు రెండుసార్లు గెలిపించిన ఎమ్మెల్యే వల్ల వారి జీవితాల్లో ఏ మార్పు రాలేదన్నారు లోకేష్. తాను చేసిన సంక్షేమంలో కనీసం 10 శాతం అయినా ఆ ఎమ్మెల్యే చేశారా అని ప్రశ్నించారు.

రాష్ట్రమంతా జగన్ నవరత్నాలు అమలు చేస్తుంటే, తాను మంగళగిరిలో ఓడిపోయినా కూడా 23 సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు నారా లోకేష్. కోర్టు కేసుల కారణంగా యువగళం యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించిన ఆయన విజయవాడకు వచ్చారు. ఉండవల్లి నివాసంలో మంగళగిరి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు కొందరు టీడీపీలో చేరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే దేశమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానన్నారు లోకేష్.
గత ఎన్నికల్లో తాను స్వల్ప తేడాతో ఓడిపోయినా నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ప్రజల కోసం 23 సంక్షేమ పథకాలు- అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నానని తెలిపారు లోకేష్. ఆరోగ్యరథం, పెళ్లికానుక, తోపుడు బండ్లు, జలధార, కుట్టుమిషన్లు, వెల్డింగ్ మిషన్లు, పండగ కానుకలు, చేనేతలు-స్వర్ణకారుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఓడిపోయిన వారైనా తాను చేసినట్టు సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేశారేమో కనుక్కోండని ప్రజలకి సూచించారు.
మంగళగిరి ప్రజలు రెండుసార్లు గెలిపించిన ఎమ్మెల్యే వల్ల వారి జీవితాల్లో ఏ మార్పు రాలేదన్నారు లోకేష్. తాను చేసిన సంక్షేమంలో కనీసం 10 శాతం అయినా ఆ ఎమ్మెల్యే చేశారా అని ప్రశ్నించారు. తనని గెలిపిస్తే పేదరికం లేని, ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఉన్నా తన మనసంతా మంగళగిరిపైనే ఉందని చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ మంగళగిరి నియోజకవర్గం, ప్రజల బాగోగుల గురించి తెలుసుకుంటూనే ఉంటానన్నారు లోకేష్. ఎవరైనా కష్టంలో ఉన్నానని, సమస్య ఉందని మెసేజ్ పంపినా కూడా స్పందిస్తానని భరోసా ఇచ్చారు. ఈసారి మంగళగిరిలో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు లోకేష్.