అభ్యర్థులపై బండలేసిన లోకేష్.. అంతా తూచ్
ఎప్పుడైతే లోకేష్ తమను అభ్యర్థులుగా అందరిముందు ప్రకటించారో అప్పటి నుండి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బాగా ఖర్చు పెడుతున్నారు. మరి ఇప్పుడు తాను ప్రకటించిన వాళ్ళెవరు అభ్యర్థులు కారన్న లోకేష్ ప్రకటనతో వాళ్ళనెత్తిన పెద్ద బండపడినట్లయ్యింది.
యువగళం పాదయాత్రలో భాగంగా తాను ప్రకటించిన వాళ్ళెవరు అభ్యర్థులుగా ఉంటారనే గ్యారెంటీ లేదు అంతా తూచ్ అనేశారు నారా లోకేష్. అభ్యర్థులను ఫైనల్ చేసేది, ప్రకటించేది అంతా అధినేత చంద్రబాబునాయుడే అని తేల్చేశారు. మరిప్పటివరకు అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళ పరిస్థితి ఏమిటంటే దాంతో తనకు సంబంధంలేదనేశారు. రాజమండ్రిలో మహానాడు జరిగిన విషయం తెలిసిందే. పాదయాత్ర చేస్తున్న లోకేష్ మహానాడులో పాల్గొనేందుకు విరామం తీసుకున్నారు.
మహానాడులో చాలా యాక్టివ్‌గానే కనిపించారు. అభ్యర్థుల ఎంపిక, ప్రకటన విషయంపై మీడియా ప్రశ్నించగా.. అంతా అధినేత చంద్రబాబే చూసుకుంటారని చెప్పారు. మరి పాదయాత్రలో భాగంగా కొందరు నేతలను అభ్యర్థులుగా ప్రకటించారు కదా అని అడిగినపుడు అదంతా ఉత్తదే అని కొట్టిపడేశారు. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల ప్రకటన అధికారం తనకెక్కడుందని ఎదురు ప్రశ్నించారు.
మరిప్పటివరకు ప్రకటించిన వాళ్ళ పరిస్థితి ఏమిటని అడిగినప్పుడు అంతా తూచ్ అనేశారు. నేతల్లో జోష్ నింపేందుకు తాను కొందరు నేతల చేతులు పైకెత్తి ఓట్లేసి గెలిపించాలని చెప్పింది వాస్తవమే అని అంతమాత్రాన వాళ్ళంతా అభ్యర్థులు అయిపోతారా అని అమయాకంగా ప్రశ్నించారు. లోకేష్ మరచిపోయేరేమో కానీ నగిరిలో గాలి భానుప్రకాష్ నాయుడు, శ్రీకాళహిస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి, పలమనేరులో అమర్నాథ్‌రెడ్డి, చంద్రగిరిలో పులివర్తి నాని, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ లాంటి కొందరిని అభ్యర్థులుగా ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో వీళ్ళందరికీ ఓట్లేసే గెలిపించాలని జనాలను కోరారు.
ఎప్పుడైతే లోకేష్ తమను అభ్యర్థులుగా అందరిముందు ప్రకటించారో అప్పటి నుండి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బాగా ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు తాను ప్రకటించిన వాళ్ళెవరు అభ్యర్థులు కారన్న లోకేష్ ప్రకటనతో వాళ్ళనెత్తిన పెద్ద బండపడినట్లయ్యింది. రేపటి నుండి నియోజకవర్గాల్లో తమ మద్దతుదారులకు ఏమని సమాధానం చెప్పుకోవాలి, జనాలను ఓట్లు ఎలా అగడగాలి అన్నది పెద్ద సమస్యగా మారిపోయింది.