Telugu Global
Andhra Pradesh

అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటమా?

పరువు తమకే కాదని ఇతరులకు కూడా ఉంటుందని చంద్రబాబు, లోకేష్ మరచిపోయినట్లున్నారు. జగన్‌పై నోటికొచ్చినట్లుగా బురదచల్లేస్తున్న లోకేష్ కూడా పరువు గురించి మాట్లాడటం, పరువునష్టం దావా వేయటమే ఆశ్చర్యంగా ఉంది.

అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటమా?
X

నారా లోకేష్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రత్యర్థులపైన బురదచల్లటంలో తెలుగుదేశం పార్టీకి మించిన పార్టీ దేశంలోనే ఇంకోటుండదు. అలాంటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ప్రత్యర్థులపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి, సింగలూరి శాంతి ప్రసాద్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారట. తనపై చేసిన ఆరోపణలను నిరూపించమంటే నిరూపించలేకపోయారట. అందుకనే వాళ్ళపై పరువు నష్టం దావా వేశారు. దానికి సంబంధించిన విచారణ హైకోర్టులో జరుగుతోంది.

తన పరువుకు భంగం కలిగించారని లోకేష్ అనుకోవటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే గడచిన 13 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ చేసినన్ని తప్పుడు ఆరోపణలు, విమర్శలు ఇంకెవరిమీదా చేసుండరు. తప్పుడు ఆరోపణలు చేయటంలో చంద్రబాబునాయుడు, లోకేష్ కూడా ముందువరుసలోనే ఉంటారు. జగన్ లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నారని సంవత్సరాల తరబడి ఆరోపణలు చేస్తునే ఉన్నారు. ఇప్పుడు కూడా గంజాయి అమ్మకాల ద్వారా వేలా కోట్ల రూపాయలను జగన్ సంపాదిస్తున్నాడని చంద్రబాబు, లోకేష్‌తో పాటు తమ్ముళ్ళంతా ఆరోపణలు చేస్తునే ఉన్నారు.

మరి జగన్‌పై వీళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమైనవేనా? తమ ఆరోపణలను వీళ్ళు నిరూపించగలరా? వీళ్ళ దగ్గర ఆధారాలుండే జగన్‌పై ఆరోపణలతో బురదచల్లేస్తున్నారా? ప్రత్యర్థులపై వీళ్ళు ఆరోపణలు చేయదలచుకుంటే ఆధారాలు అవసరంలేదు. అదే ఇతరులు ఎవరైనా వీళ్ళపై ఆరోపణలు చేస్తే ఆధారాలను చూపమంటారు. లేకపోతే కోర్టులో పరువునష్టం దావా వేస్తారు.

పరువు తమకే కాదని ఇతరులకు కూడా ఉంటుందని చంద్రబాబు, లోకేష్ మరచిపోయినట్లున్నారు. జగన్‌పై నోటికొచ్చినట్లుగా బురదచల్లేస్తున్న లోకేష్ కూడా పరువు గురించి మాట్లాడటం, పరువునష్టం దావా వేయటమే ఆశ్చర్యంగా ఉంది. నిరాధార ఆరోపణలు ఎవరు ఎవరిపైన చేసినా తప్పే అనటంలో సందేహం లేదు. ఒకప్పుడు ప్రత్యర్ధులపై ఆరోపణలు చేయాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు అచ్చంగా బురదచల్లేయటమే కాబట్టి ఆధారాలు, నైతికత అనే విషయాల గురించి ఎవరు పట్టించుకోవటంలేదు. లోకేష్ వేసిన పరువునష్టం దావా ఎప్పటికి తేలుతుందో చూడాలి.

First Published:  21 Aug 2023 6:18 AM
Next Story