ఢిల్లీలో ముగిసిన దీక్ష.. లోకేష్ వృథా ప్రయాస
4వతేదీ ఏపీలో సీఐడీ విచారణ ఉంది కాబట్టి లోకేష్ పెట్టేబేడా సర్దుకోవాల్సిన టైమ్ వచ్చింది. ఈలోగా కనీసం ఢిల్లీలో ఇతర పార్టీ నేతలయినా వచ్చి పలకరిస్తారనుకుంటే ఈరోజు నిరాహారదీక్ష చేసినా ఫలితం కనపడలేదు. దీంతో లోకేష్ కాస్త దిగాలుగానే దీక్షా శిబిరాన్ని ఖాళీ చేశారు.
చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా ఢిల్లీలో నారా లోకేష్ చేపట్టిన ఒకరోజు నిరాహారదీక్ష ముగిసింది. లోథీ రోడ్డులో టెంటు వేసుకుని, టీడీపీ నేతలతో కలసి లోకేష్ ఉదయం దీక్షకు కూర్చున్నారు. సాయంత్రానికి దీక్ష ముగిసిందని టెంటు సర్దేశారు. ఈ నిరసన దీక్షకయినా ఇతర పార్టీల మద్దతు ఉంటుందని అనుకున్నా.. ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. దీంతో లోకేష్ ప్రయాస వృథాగా మారిందని అంటున్నారు.
లోకేష్ ఏమన్నారంటే..?
ఏపీలో జగన్ ఫ్యాక్షన్ పాలన సాగిస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు నారా లోకేష్. 45ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయని చంద్రబాబును అక్రమకేసుల్లో ఇరికించి 23రోజులుగా జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, జగన్ ప్రభుత్వ అరాచకపాలనకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు చెప్పారు లోకేష్.
టీడీపీ ఎంపీలు, వైసీపీ దూరంగా విసిరేసిన రఘురామకృష్ణంరాజు, లోకేష్ దృష్టిలో పడాలని ఏపీ నుంచి వచ్చిన ఒకరిద్దరు నేతలు మినహా ఇంకెవరూ ఢిల్లీ దీక్షకు సంఘీభావంగా తరలి రాలేదు. చివర్లో సర్వమత ప్రార్థనలంటూ హడావిడి చేసి దీక్ష ముగించేశారు లోకేష్. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, హిందూ, ముస్లిం మత సంఘాల పెద్దలు, ఢిల్లీ తెలుగు పాస్టర్స్ అసోసియేషన్.. ఇలా ఎవరెవరో వచ్చి మద్దతిచ్చారని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4వతేదీ ఏపీలో సీఐడీ విచారణ ఉంది కాబట్టి లోకేష్ పెట్టేబేడా సర్దుకోవాల్సిన టైమ్ వచ్చింది. ఈలోగా కనీసం ఢిల్లీలో ఇతర పార్టీ నేతలయినా వచ్చి పలకరిస్తారనుకుంటే ఈరోజు నిరాహారదీక్ష చేసినా ఫలితం కనపడలేదు. దీంతో లోకేష్ కాస్త దిగాలుగానే దీక్షా శిబిరాన్ని ఖాళీ చేశారు.