Telugu Global
Andhra Pradesh

బంపరాఫరా? వరస్టాఫరా?

లోకేష్ మీద 20 కాదు మరో 50 కేసులున్నా ఏమీకాదు. ఎందుకంటే లోకేష్ తరపున కోర్టుల్లో పోరాటం చేయటానికి పదుల సంఖ్యలో లాయర్లు సిద్ధంగా ఉంటారు. కానీ మిగిలినవాళ్ళ పరిస్థితి అలా ఉండదు.

బంపరాఫరా? వరస్టాఫరా?
X

తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ ఏమి చేయదలచుకున్నారో అర్థంకావటంలేదు. యువగళం పాదయాత్రలో మాట్లాడుతూ.. కార్యకర్తలకు బంపరాఫర్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంతకీ ఆ బంపరాఫర్ ఏమిటంటే 2019-24 మధ్య ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంతపెద్ద నామినేటెడ్ పోస్టు ఇచ్చే బాధ్యత తనదట. అంటే నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవాలంటే కార్యకర్తలు లేదా నేతలపై కేసులు నమోదై ఉండాలని కచ్చితంగా చెబుతున్నారు.

గతంలో కూడా కనీసం 10 కేసులన్నా నమోదు కానివాళ్ళు పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టవద్దని చెప్పిన విషయం తెలిసిందే. 10 కేసులని ఒకసారి, ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి అంతపెద్ద నామినేటెడ్ పోస్టుల‌ని ఇప్పుడు చెబుతున్నారు. ఇదంతా ఎప్పుడంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు. మరి 2024లో కూడా పార్టీ అధికారంలోకి రాకపోతే అప్పుడు ఏం చేస్తారు?

రేపటి ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ ఓడిపోతే కేసులు పెట్టించుకుంటున్న నేతలు, క్యాడర్ పరిస్థితి ఏంటి? లోకేష్ మాటతో కేసులు పెట్టించుకుంటే వాళ్ళ జీవితం అంతా పోలీసుస్టేషన్లు, కోర్టులు, జైళ్ళల్లోనే సరిపోతుంది. అప్పుడు వాళ్ళ కుటుంబాల బాధ్యత లోకేష్ తీసుకుంటారా? తాను చాలా గొప్పగా మాట్లాడుతున్నట్లు లోకేష్ అనుకుంటున్నారేమో. నేతలు, క్యాడర్ జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నట్లు అనిపించటంలేదు. ఇప్పటికే ఏవో కేసుల్లో ఇరుక్కున్న నేతలు, క్యాడర్ నానా అవస్థ‌లు పడుతున్నది లోకేష్ చూడటంలేదా? మొన్నటి పుంగనూరు అల్లర్ల కేసుల కారణంగా అరెస్టులకు భయపడి వందల మంది ఇళ్ళని వదిలేసి తప్పించుకుని ఎక్కడెక్కడో తిరుగుతున్నది లోకేష్‌కు తెలీదా?

తన మీద 20 కేసులున్నాయని లోకేష్ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. లోకేష్ మీద 20 కాదు మరో 50 కేసులున్నా ఏమీకాదు. ఎందుకంటే లోకేష్ తరపున కోర్టుల్లో పోరాటం చేయటానికి పదుల సంఖ్యలో లాయర్లు సిద్ధంగా ఉంటారు. కానీ మిగిలినవాళ్ళ పరిస్థితి అలా ఉండదు. కాబట్టి ఇప్పుడు లోకేష్ బంపరాఫర్ ఇచ్చారుకదాని రెచ్చిపోతే కేసుల దెబ్బకు మునిగిపోయేది నేతలు, కార్యకర్తలే. లోకేష్ ఇపుడు ఇచ్చింది బంపరాఫర్ కాదు వరస్ట్‌ ఆఫర్.


First Published:  27 Aug 2023 11:37 AM IST
Next Story