Telugu Global
Andhra Pradesh

లోకేష్ లాజిక్ మరచిపోయారా?

గన్నవరంలో వైసీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేయబోతున్నారు. వంశీకి వ్యతిరేకంగా ఎవరిని పోటీ చేయించబోతున్నారో ఆ మాట చెప్పాలి. టీడీపీ అధికారంలోకి వస్తే గన్నవరంలో ఏం చేయబోతున్నామో చెప్పాలి.

లోకేష్ లాజిక్ మరచిపోయారా?
X

నారా లోకష్ గన్నవరంలో మాట్లాడిన మాటలు భలేగున్నాయి. లోకేష్ చాలా విషయాలు మాట్లాడారు కానీ అందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ‘టీడీపీ అధికారంలోకి రాగానే కొడాలి నానిని కడ్రాయర్‌తో గుడివాడలో ఊరేగింపు చేయించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు’ అన్నారు. గన్నవరం బహిరంగసభలో గుడివాడ గోలెందుకో అర్థంకాలేదు. గన్నవరంలో వైసీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేయబోతున్నారు. వంశీకి వ్యతిరేకంగా ఎవరిని పోటీ చేయించబోతున్నారో ఆ మాట చెప్పాలి. టీడీపీ అధికారంలోకి వస్తే గన్నవరంలో ఏం చేయబోతున్నామో చెప్పాలి.

అదీకాకపోతే అధికారంలో ఉన్నపుడు గన్నవరంలో చేసిన డెవలప్మెంట్లు ఏమన్నా ఉంటే అది చెప్పుకోవాలి. ఇవన్నీ వదిలిపెట్టి కొడాలి నానిని గుడివాడలో కడ్రాయర్‌తో ఊరేగిస్తానని బెదిరించటం ఏమిటో ఎవరికీ అర్థంకావటంలేదు. ఇక్కడే లోకేష్, చంద్రబునాయుడుతో పాటు తమ్ముళ్ళు ఒక లాజిక్ మరచిపోతున్నారు. కొడాలి నాని లేదా వంశీలను తాము అది చేస్తాం ఇది చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇదంతా జరిగేదెప్పుడు? తాము అధికారంలోకి వచ్చినప్పుడు.

తాము అధికారంలోకి వస్తే ఏదైతే చేస్తామని ఇప్పుడు చెబుతున్నారో ఇప్పటికిప్పుడు కొడాలి నాని లేదా వంశీలు ఆ పనిచేసేయగలరు కదా? ఇప్పటికప్పుడే లోకేష్ గుడ్డలూడదీసి కడ్రాయర్‌తో ఊరేగింపు చేయాలని కొడాలి నాని లేదా వంశీ అనుకుంటే ఏమి జరుగుతుంది? నాని, వంశీ ఆ పని చేయగలరో లేదో తెలీదు కానీ ప్రయత్నిస్తే కంపు కంపయిపోతుంది కదా. ఒకవైపు లోకేష్ మరోవైపు పవన్ కల్యాణ్ ఇదే పద్ధ‌తిలో బెదిరిస్తున్నారు. ఎక్కడ మాట్లాడినా మోకాళ్ళ మీద నించోబెడతా, డ్రాయర్‌తో పరిగెట్టిస్తా, తాట తీస్తా, తోలు తీస్తా అని అంటున్నారు.

వీళ్ళు చేస్తామని బెదిరిస్తున్నవన్నీ ఇప్పుడు చేసే అవకాశం వైసీపీ నేతలకు ఉందన్న విషయాన్ని పవన్, లోకేష్ మరచిపోతున్నారు. అసలు ఇన్ని మాటలు చెప్పేబదులు గుడివాడ లేదా గన్నవరంలో లోకేష్ పోటీ చేయచ్చు కదా. పై రెండు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట లోకేష్ పోటీ చేస్తే తాను నిప్పా లేకపోతే తుప్పా అన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది. లోకేష్ గనుక కాస్త ధైర్యం చేసి పోటీకి దిగితే వైసీపీ నేతల నోళ్ళన్నీ మూతపడిపోవటం ఖాయం. గెలుపోటములు ఎవరిదో మళ్ళీ చూసుకోవచ్చు.


First Published:  24 Aug 2023 10:56 AM IST
Next Story