Telugu Global
Andhra Pradesh

మళ్లీ ఢిల్లీకి లోకేష్.. ఎందుకంటే..?

చంద్రబాబు కేసు విషయంలో న్యాయ నిపుణులతో చర్చించేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని టీడీపీ శ్రేణులంటున్నాయి. కానీ ఇంత తక్కువ వ్యవధిలో లోకేష్ తిరిగి ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. న్యాయ నిపుణులతో లోకేష్ ఏం చర్చిస్తారనేది ఆసక్తిగా మారింది.

మళ్లీ ఢిల్లీకి లోకేష్.. ఎందుకంటే..?
X

చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టి 20రోజులపాటు అక్కడే ఉన్నారు. ఇటీవల ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, సీఐడీ విచారణ వ్యవహారాల నేపథ్యంలో ఆయన ఏపీకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ వెళ్లారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తదుపరి విచారణ ఎల్లుండి సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంది. దీంతో లోకేష్ మరోసారి ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది.

మళ్లీ ఢిల్లీ ఎందుకు..?

ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన లోకేష్, కుటుంబ సభ్యులతో కలసి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఒకరోజు గడిచేలోపే మళ్లీ ఢిల్లీకి బయలుదేరారు. చంద్రబాబు కేసు విషయంలో న్యాయ నిపుణులతో చర్చించేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని టీడీపీ శ్రేణులంటున్నాయి. కానీ ఇంత తక్కువ వ్యవధిలో లోకేష్ తిరిగి ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. న్యాయ నిపుణులతో లోకేష్ ఏం చర్చిస్తారనేది ఆసక్తిగా మారింది.

మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు లిస్ట్ అయింది. సోమవారం విచారణకు వచ్చే కేసుల్లో 59వ నెంబర్ గా చంద్రబాబు క్వాష్ పిటిషన్ లిస్ట్ అయింది. ఈ క్వాష్ పిటిషన్ పైనే టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు కస్టడీని వరుసగా పెంచుకుంటూ పోవడం, అటు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు కూడా తరుముకొస్తుండటంతో.. అసలు చంద్రబాబు భవిష్యత్ ఏంటనేది తేలడంలేదు. ఇటు ఏపీలో అందుబాటులో లేకుండా.. లోకేష్ ఢిల్లీలో మకాం వేయడంతో కేడర్ కి ఏంచేయాలో తోచడంలేదు.


First Published:  7 Oct 2023 2:04 PM IST
Next Story