Telugu Global
Andhra Pradesh

పోతుల సునీత, గుర్రంపాటిపై లోకేష్‌ కేసు.. వారు చేసిన ప్రచారం ఇదే..

ఈ ఏడాది ఆగస్ట్‌లో ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో గుర్రంపాటి దేవేందర్‌ రెడ్డి ట్విట్టర్‌లో ఈ ఆత్మహత్యకు చంద్రబాబు, నారా లోకేష్‌ కారణమంటూ పోస్టు పెట్టారు.

పోతుల సునీత, గుర్రంపాటిపై లోకేష్‌ కేసు.. వారు చేసిన ప్రచారం ఇదే..
X

వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌- ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్ గుర్రంపాటి దేవేందర్‌ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రిమినల్ కేసు వేశారు. మంగళగిరి మెజిస్ట్రేట్‌ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసినట్టు లోకేష్ తరపు న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు వెల్లడించారు.

ఈ ఏడాది ఆగస్ట్‌లో ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో గుర్రంపాటి దేవేందర్‌ రెడ్డి ట్విట్టర్‌లో ఈ ఆత్మహత్యకు చంద్రబాబు, నారా లోకేష్‌ కారణమంటూ పోస్టు పెట్టారు. ఉమామహేశ్వరికి జూబ్లిహిల్స్‌ రోడ్డు నెం. 45లో 5.73 ఎకరాల భూమి ఉందని.. ఆ భూమి విషయంలో చంద్రబాబుతో వివాదం ఉందని.. ఆమె మరణానికి ఈ భూ వివాదమే కారణమంటూ కొన్ని సర్వే నెంబర్లను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే దేవేందర్ రెడ్డి చెప్పిన సర్వే నెంబర్లే అసలు లేవని లోకేష్ తరపు న్యాయవాది వివరించారు.

తాను చేసిన ట్వీట్ ఫేక్ అని తెలిసిపోవడంతో వెంటనే మరో కథ అల్లిన దేవేందర్ రెడ్డి, ఉమామహేశ్వరి హెరిటేజ్ సంస్థలో 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారని.. అక్కడ తనకు మోసం జరగడంతో ఆత్మహత్య చేసుకున్నారంటూ మరో ట్వీట్‌లో ఆరోపించారని.. ఇలా చేయడం ద్వారా నారా లోకేష్‌ పరువుకు నష్టం కలిగించారని న్యాయవాది కోర్టుకు వివరించారు. దేవేందర్‌ రెడ్డి చేసిన ప్రచారానికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించినట్టు వివరించారు.

అటు పోతుల సునీత వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. హెరిటేజ్ ద్వారా చంద్రబాబు కుటుంబ సభ్యులు సారా వ్యాపారం చేస్తున్నారని, బీ3 అంటే భువనేశ్వరి, బ్రహ్మణి, బాబు అని వీరు ముగ్గురు కలిసి రాష్ట్రంలో సారాను ఏరులై పారిస్తున్నారంటూ ఆరోపించారు. భువనేశ్వరి, బ్రహ్మణి ఇద్దరు మద్యం తాగి కొట్టుకున్నారని ఆమె కామెంట్ చేశారు. నారా లోకేష్‌కు మందు, మగువ లేనిదే నిద్రపట్టదంటూ పోతుల సునీత ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ మద్యం తాగిన తర్వాతే మీడియా ముందుకు వస్తారని కూడా ఆమె చెప్పారు. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను, సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని కోర్టుకు లోకేష్ న్యాయవాది అందజేశారు.

తప్పుడు ఆరోపణలను చేసి లోకేష్, అతడి కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించినందుకు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, పోతుల సునీతపై చర్యలు తీసుకోవాలని కోర్టును లోకేష్ తరపు న్యాయవాది కోరారు.

First Published:  1 Dec 2022 8:15 AM IST
Next Story