ఆమెకు బెంజి.. జనాలకు గంజి
పాప అన్నందుకు ఆమె బాధపడ్డారని... అందుకే జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్.
ఆమధ్య మంత్రి రోజా బెంజికారు కొన్న తర్వాత చాలామంది విమర్శలు ఎక్కుపెట్టారు, తాజాగా నారా లోకేష్ కూడా నగరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా గంజి, బెంజి అంటూ రోజాపై సెటైర్లు పేల్చారు. ‘నగరికి రాకముందు ఆమె పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. ఇప్పుడు బెంజికారు, ఊరు ఊరుకో విల్లా, చెప్పులు పట్టుకుని తిరిగేందుకు ఒక అధికారి ఉన్నారు. ప్రజలకు మాత్రం గంజి నీళ్లు, కన్నీళ్లు మిగిలాయి.’ అని చురకలంటించారు లోకేష్.
ఒక నియోజకవర్గం.. ఐదుగురు ఎమ్మెల్యేలు
నగరి నియోజకవర్గానికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు లోకేష్. నిండ్ర, పుత్తూరు, వడమాలపేట మండలాలకు రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అని, విజయపురానికి కుమారస్వామిరెడ్డి, నగరికి రోజా భర్త సెల్వమణి, ఆయన తమ్ముడు ఎమ్మెల్యేలు అని.. అసలు ఎమ్మల్యే రోజాతో కలిపి మొత్తం నగరికి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారంటూ ఎద్దేవా చేశారు.
డైమండ్ పాప.. జబర్దస్త్ అంటీ
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సైకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సమానంగా డైమండ్ పాప తయారైందన్నారు లోకేష్. పాప అన్నందుకు ఆమె బాధపడ్డారని... అందుకే జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల హామీలు..
యువగళంలో పెద్దగా హామీల జోలికి వెళ్లని నారా లోకేష్.. నగరిలో మాత్రం ధారాళంగా హామీలిచ్చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ లూమ్ పరిశ్రమలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా నగరిలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు లోకేష్. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు పండగలా ఉండేదని, జగన్ సీఎం అయిన తర్వాత ఎప్పుడు జీతం వస్తుందా అని దేవుడి వైపు చూసే పరిస్థితి నెలకొందని కౌంటర్ ఇచ్చారు లోకేష్.