Telugu Global
Andhra Pradesh

వర్మ 'వ్యూహం'లో చిక్కుకున్న లోకేష్..

వ్యూహం సినిమా థియేటర్ రిలీజ్ ని కూడా అడ్డుకోడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వర్మ వ్యూహంలో చిక్కుకున్న లోకేష్..
X

ఏపీలో ఎన్నికల వేళ రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం'సినిమా సంచలనంగా మారే అవకాశముంది. ఈ సినిమా సెన్సార్ ని అడ్డుకోడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ దశలో కూడా నారా లోకేష్ తన ప్రయత్నాలను వదిలిపెట్టకపోవడం విశేషం. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో సినిమాని అడ్డుకోడానికి నారా లోకేష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఓటీటీ, ఆన్ లైన్, ఇంటర్నెట్ లో 'వ్యూహం' సినిమాను విడుదల చేయొద్దని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది.

ఇక వ్యూహం సినిమా థియేటర్ రిలీజ్ ని కూడా అడ్డుకోడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల సమయంలో తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నచ్చరని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. తెర వెనక జగన్ ఉండి ఈ సినిమా తీయించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దర్శక నిర్మాతలను, సెన్సార్ బోర్డ్ కమిటీని కూడా ప్రతివాదులుగా చేర్చారు.

ఎందుకీ తంటాలు..?

రామ్ గోపాల్ వర్మ సినిమాలు జనం లైట్ తీసుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు అండ్ కో ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీసి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్న సమయంలో, వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ లక్ష్మీపార్వతి కోణంలో సినిమా తీశారు. ఆ రెండు సినిమాలనూ జనం పట్టించుకోలేదు. ఇప్పుడు 'వ్యూహం' అంటూ పక్కా పొలిటికల్ మూవీ తీశానంటున్నారు. ఈ సినిమా టేకింగ్ కూడా వర్మ ప్రమాణాలకు తగ్గట్టే ఉందనే విషయం ట్రైలర్ లోనే అర్థమవుతోంది. అయితే సీఎం జగన్ ది ఇందులో హీరో క్యారెక్టర్ కాబట్టి వైసీపీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారిలో థియేటర్ వరకు వెళ్లి ఎంతమంది చూస్తారనేది అనుమానమే. ఇలాంటి టైమ్ లో అనవసరంగా ఈ సినిమాను అడ్డుకుంటూ లేనిపోని ప్రచారం కల్పిస్తున్నారు లోకేష్. వర్మ వ్యూహంలో చిక్కుకుపోయారు.

అప్పట్లో పవన్ కల్యాణ్ 'బ్రో' సినిమాపై కూడా మంత్రి అంబటి రాంబాబు ఇలానే చిందులు తొక్కారు. శ్యాంబాబు పాత్ర తనను ఉద్దేశించి తీసిందేనంటూ ఢిల్లీదాకా వెళ్లి మరీ హడావిడి చేశారు. చివరకు ఏమైంది..? కొన్నిరోజులకు సినిమాను జనం మరచిపోయారు, శ్యాంబాబు పాత్రని కూడా మరచిపోయారు. కానీ అప్పట్లో మంత్రి చేసిన హడావిడి మాత్రం సామాన్య ప్రేక్షకులకు కాస్త విచిత్రంగా తోచింది. సొంత శాఖ గురించిన సమాచారం చెప్పడానికి కూడా అన్నేసి ప్రెస్ మీట్లు పెట్టని అంబటి రాంబాబు, బ్రో సినిమాపై మాత్రం రోజుకో ప్రెస్ మీట్ పెట్టారంటూ సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ ఈ ఎపిసోడ్ కి అదనం. ఇప్పుడు లోకేష్ కూడా అనవసరంగానే ఈ సిినిమాకి హైప్ ఇస్తున్నారు. జనాల్లో లేని క్యూరియాసిటీని పెంచుతున్నారు. పరోక్షంగా రామ్ గోపాల్ వర్మకు పబ్లిసిటీ ఇస్తున్నారు.

First Published:  23 Dec 2023 5:30 AM GMT
Next Story