సెల్ఫీల దెబ్బ..! లోకేష్ భుజానికి గాయం..
ప్రస్తుతం ఆయన యాత్రలో కుడి చేయిని అస్సలు కదల్చడంలేదు. ఎడమ చేతితోనే అభివాదం చేస్తున్నారు. చెయ్యి నొప్పి పుడుతున్నా కూడా ఆయన యాత్ర ఆపలేదు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 46వ రోజుకి చేరుకుంది. మధ్యలో రెండు విడతల్లో నాలుగు రోజుల గ్యాప్ తీసుకున్నారు కానీ, మిగతా సమయమంతా ఆయన యాత్రలోనే ఉన్నారు. అయితే తాజాగా ఆయన భుజానికి గాయమైంది. ఆయన్ను వైద్యులు వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. కానీ లోకేష్ మాత్రం యాత్ర కొనసాగిస్తానని మొండికేసినట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలొస్తున్నాయి. టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో కూడా నారో లోకేష్ భుజం గాయాన్ని హైలెట్ చేస్తున్నారు.
ఎడమచేతితోనే అభివాదం..
లోకేష్ కుడి చేతితో పిడికిలి బిగించి యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు. మధ్య మధ్యలో కూడా ఆయన పిడికిలి బిగించి ప్రజలకు అభివాదం చేస్తున్నారు. సెల్ఫీలు తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన యాత్రలో కుడి చేయిని అస్సలు కదల్చడంలేదు. ఎడమ చేతితోనే అభివాదం చేస్తున్నారు. చెయ్యి నొప్పి పుడుతున్నా కూడా ఆయన యాత్ర ఆపలేదు. లోకేష్ యాత్రకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని, ఆయన మీద పడిపోతున్నారని, ఆయన దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ రద్దీలో ఆయన భుజానికి గాయమైందని కూడా వార్తలొస్తున్నాయి.
భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ నారా లోకేష్ గారి 46వ రోజు యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది#LokeshinKadiri#YuvaGalamPadayatra#YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#YuvaGalamLokesh
— Telugu Desam Party (@JaiTDP) March 18, 2023
సెల్ఫీల ఎఫెక్టేనా..?
నారా లోకేష్ భుజం గాయంపై వైసీపీ నుంచి ఓ రేంజ్ లో సెటైర్లు పడుతున్నాయి. ఈమధ్య ఎక్కడికెళ్లినా లోకేష్ సెల్ఫీలు తీస్తున్నారని, అలా తీసీ తీసీ ఆయన భుజం నొప్పి వచ్చి ఉంటుందన్నారు వైసీపీ అభిమానులు. యాత్ర కు ప్రజాదరణ లేకపోవడం వల్లే ఇలా డ్రామాలాడుతున్నారని, భుజం నొప్పి, కాలి నొప్పి అంటూ లోకేష్ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారని కౌంటర్లిస్తున్నారు.