రెండు కీలక భేటీలకు నారా లోకేష్ డుమ్మా.. కారణం ఏమిటి?
అధికారంలో పవన్ కల్యాణ్‌కు వాటా ఇస్తారా అని ప్రశ్నిస్తే.. ఆ ప్రసక్తే లేదని, మొత్తం ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ, జనసేన కీలక సమావేశాలకు రెండింటికి హాజరు కాలేదు. అత్యంత ప్రాధాన్యం వహించిన ఈ రెండు సమావేశాల్లో ఆయన పాల్గొనకపోవడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇటీవల రెండు పార్టీలకు మధ్య జరిగిన సీట్ల పంపకం సమావేశానికి ఆయన రాలేదు. తాడేపల్లిగూడెంలో జరిగిన సభకు కూడా డుమ్మా కొట్టారు. తీరిక లేక ఆయన రాలేదా, మరో కారణం ఏదైనా ఉందా అనే చర్చ సాగుతోంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం నారా లోకేష్‌కు నచ్చలేదని, జనసేనతో పొత్తు ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు. చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్‌ను కలవడం కూడా లోకేష్‌కు రుచించలేదట. దీంతో పవన్ కల్యాణ్ హాజరయ్యే సభకు దూరంగా ఉండాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు చెప్పుతున్నారు.
పవన్ కల్యాణ్‌పై నారా లోకేష్‌కు సానుకూల అభిప్రాయం లేదని ఇటీవల జరిగిన ఓ సంఘటనను ఉదహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్‌పై లోకేష్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఉటంకిస్తున్నారు. అధికారంలో పవన్ కల్యాణ్‌కు వాటా ఇస్తారా అని ప్రశ్నిస్తే.. ఆ ప్రసక్తే లేదని, మొత్తం ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు.
పవన్ కల్యాణ్ కేవలం ఓ సినీ హీరో మాత్రమేనని, రాజకీయ నాయకుడు కాదని లోకేష్ అభిప్రాయంగా చెప్పుతున్నారు. సినిమా గ్లామర్ వల్లే పవన్ కల్యాణ్ సభలకు క్రేజ్ ఏర్పడుతోందని ఆయన భావిస్తున్నారట.