రామ్ కి అన్నీ తెలుసు.. కేటీఆర్ గురించి లోకేష్ ఏమన్నారంటే..?
వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే జాకీ కంపెనీని ఏపీ లైట్ తీసుకుందని, దాని విలువ తెలుసు కాబట్టే, రాష్ట్రానికి దానివల్ల మేలు జరుగుతుంది కాబట్టే కేటీఆర్ వెంటనే తెలంగాణకు వెల్కమ్ చెప్పారని అన్నారు.
ఇటీవల ఏపీ నుంచి జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది, ఆ తర్వాత అమర్ రాజా కంపెనీ కూడా అతి పెద్ద ప్లాంట్ ని తెలంగాణలో పెట్టడానికి సిద్ధమైంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం అసమర్థతతోపాటు, తెలంగాణ సర్కారు సమర్థత కూడా ఉందని ఒప్పుకున్నారు నారా లోకేష్. కాలుష్యం నెపంతో ఏపీలో అమర్ రాజా కంపెనీని ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, ఓ దశలో మూసివేతకు ప్రయత్నించిందని మండిపడ్డారు. "రామ్ ఏమైనా పిచ్చోడా, పొల్యూషన్ ఉన్న కంపెనీ తీసుకోడానికి..? ఆయన అన్నీ బేరీజు వేసుకునే అమర్ రాజా కి ఆహ్వానం పలికార"ని చెప్పారు. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే జాకీ కంపెనీని ఏపీ లైట్ తీసుకుందని, దాని విలువ తెలుసు కాబట్టే, రాష్ట్రానికి దానివల్ల మేలు జరుగుతుంది కాబట్టే కేటీఆర్ వెంటనే తెలంగాణకు వెల్కమ్ చెప్పారని అన్నారు. కంపెనీల తరలింపు విషయంలో ఏపీ ప్రభుత్వం అసమర్థతను విమర్శిస్తూ, అదే సమయంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముందుచూపుని మెచ్చుకున్నారు లోకేష్.
బటన్ రెడ్డి నొక్కుతూ కూర్చున్నారు..
"జగన్ బటన్ నొక్కారు.. కరెంట్ ఛార్జీలు పెరిగాయి, జగన్ బటన్ నొక్కారు.. చెత్త పన్ను వేశారు, జగన్ బటన్ నొక్కారు.. పరిశ్రమలు తరలిపోతున్నాయి, జగన్ బటన్ నొక్కారు.. ఎస్సీ, బీసీలకు చెందిన చాలా పథకాలు ఎగిరిపోయాయి, జగన్ ఓ బటన్ రెడ్డి, అలా బటన్ నొక్కుతూ కూర్చొని అమర్ రాజాను తెలంగాణకు పంపేశారు" అని మండిపడ్డారు లోకేష్. బీసీలకు న్యాయం చేసింది ఒక్క టీడీపీయేనని, తమ జయహో బీసీ అనే క్యాప్షన్ ని కూడా వైసీపీ కాపీ కొట్టిందని ఎగతాళి చేశారు.
పరువు నష్టం దావా వేస్తా.. జాగ్రత్త
తనపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు నారా లోకేష్. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో తనకేం ప్రమేయం ఉందని నిలదీశారు. ఫైబర్ గ్రిడ్ విషయంలో కూడా తప్పుడు ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారన్నారు. ఆధారాలుంటే గర్జించాలని, కానీ వైసీపీ నేతలు మ్యావ్ మ్యావ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. సంపాదించాలంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్నారు లోకేష్. స్టాన్ ఫోర్డ్ లో తనతో కలసి చదువుకున్న వాళ్లు.. నెలకు రూ.30 కోట్లు సంపాదిస్తున్నారని తనకి సంపాదనే ధ్యేయం కాదని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు తాను 1500 ఫైళ్లు క్లియర్ చేశానని, వాటిల్లో ఒక్క తప్పు కూడా వైసీపీ నిరూపించలేకపోయిందన్నారు లోకేష్.