జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. లోకేష్ పై సెటైర్లు
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆయన్ను ఆహ్వానిస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. వైసీపీ సానుభూతి పరులు లోకేష్ సమాధానాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చింది. యువగళం పాదయాత్ర తిరుపతిలో హలో లోకేష్ అనే కార్యక్రమం నిర్వహించారు. లోకేష్ స్టేజ్ పై ఉండగా కిందనుంచి పలువురు ఆయనకు ప్రశ్నలు సంధించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆయన్ను ఆహ్వానిస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని, అలా వచ్చే అందర్నీ తాను ఆహ్వానిస్తానని చెప్పారు లోకేష్. టీడీపీ నేతలు మాత్రం దీన్ని పాజిటివ్ గా ప్రచారం చేసుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.
Lokesh the real leader ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా ?
— Nallari Amarnath Reddy (@NALLARIAMAR) February 24, 2023
నూటికి కి నూరు శాతం.. రాష్ట్రం బాగు కోరుకునే అందరూ రాజకీయాల్లో కి రావాలి @naralokesh @jaitdp @iTDP_Official @tarak9999 pic.twitter.com/kEhbNpHhvX
లోకేష్ సమాధానం బాగానే ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. అసలు జూనియర్ ని ఆహ్వానించడానికి నువ్వెవరు అంటూ లోకేష్ ని టార్గెట్ చేశారు కొంతమంది. జూనియర్ తాత పెట్టిన పార్టీ టీడీపీ అని, పార్టీపై చంద్రబాబు, లోకేష్ కంటే ఎక్కువ హక్కు ఆయనకే ఉంటుందని, అలాంటి జూనియర్ ని లోకేష్ రాజకీయాల్లోకి, పార్టీలోకి ఆహ్వానించడమేంటని మండిపడ్డారు.
Jr ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నూటికి నూరు శాతం ఆహ్వానిస్తా -@naralokesh
— Syed Mahaboob Basha (@Smahaboob17) February 24, 2023
ఎవరి పార్టీలోకి ఎవరిని ఆహ్వానిస్తున్నావ్
వైసీపీ సానుభూతి పరులు లోకేష్ సమాధానాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఓసారి ప్రచారానికి తిప్పుకుని చంద్రబాబు మోసం చేశారని, ఇప్పుడు మరోసారి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన లోకేష్ కి గుర్తొచ్చారని, అది కేవలం కావాలని అడిగించిన ప్రశ్నేనంటున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చినప్పుడు స్టేజ్ కింద ఉన్నవారిలో మంచి స్పందన వచ్చింది. లోకేష్ కూడా తడబడకుండా ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు, తప్పించుకోలేదు. కానీ ఇప్పుడిలా సోషల్ మీడియాకి మాత్రం బుక్కయ్యారు. ఎన్టీఆర్ ని ఆహ్వానించడానికి మీరెవరు అంటూ లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారంతా, ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.