Telugu Global
Andhra Pradesh

పవన్ ఫ్యాన్స్ ని ఉత్సాహ పరచిన లోకేష్.. జగన్ పై ఘాటు విమర్శలు

వారాహిపై పవన్ కల్యాణ్ యాత్ర చేస్తానంటే ఆ వాహనాన్ని అడ్డుకుంటామని మంత్రులు చెబుతున్నారని.. వారాహి ఆగదు, యువగళం ఆగదు అంటూ తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించి ఆయన అభిమానుల్ని కూడా ఖుషీ చేశారు లోకేష్.

పవన్ ఫ్యాన్స్ ని ఉత్సాహ పరచిన లోకేష్.. జగన్ పై ఘాటు విమర్శలు
X

యువగళం తొలిరోజు నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ రాసుకుని వచ్చినా, అక్కడక్కడా మాటల్లో తడబాటు కనిపించింది. అయితే పదే పదే పాత మాటలే వల్లె వేయకుండా జగన్ ని జాదూ రెడ్డి అంటూ మరో కొత్త పల్లవి అందుకున్నారు లోకేష్. మూడేళ్లలో వైసీపీ చేసింది శూన్యం అన్నారు లోకేష్. మైసూర్ బోండాలో మైసూర్ లేనట్టే.. జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్ లో జాబ్ లు లేవని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఢిల్లీ మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదా ఎక్కడన్నారు. మూడు రాజధానులకు ఒక్క ఇటుకైనా వేశారా అని ప్రశ్నించారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 67ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు లోకేష్. మహిళలపై దాడులు జరిగితే గన్‌ కంటే ముందు జగన్‌ వస్తాడని ప్రగల్భాలు పలికారని, కానీ అది బుల్లెట్లు లేని గన్‌ అని ప్రజలకు అర్థమైంది అంటూ చెణుకులు విసిరారు.

ఇదీ నా అర్హత..

యువగళం పాదయాత్ర మొదలు పెట్టగానే 10మంది మంత్రులు, మాజీ మంత్రులు తనపై మాటల దాడికి దిగారని, ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారని గుర్తు చేశారు లోకేష్. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏపీని అభివృద్ధి చేశానన్నారు. ఐటీ మంత్రిగా.. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిప్పించానని చెప్పారు. ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నానన్నారు లోకేష్. ఆ మంత్రులు ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. వీధుల్లో డ్యాన్సులు వేస్తేనో, క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలురావని పరోక్షంగా కొడాలి నానికి కౌంటర్ ఇచ్చారు.


మనల్ని ఎవడ్రా ఆపేది..

వారాహిపై పవన్ కల్యాణ్ యాత్ర చేస్తానంటే ఆ వాహనాన్ని అడ్డుకుంటామని మంత్రులు చెబుతున్నారని.. వారాహి ఆగదు, యువగళం ఆగదు అంటూ తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించి ఆయన అభిమానుల్ని కూడా ఖుషీ చేశారు లోకేష్. భయం తన బయోడేటాలోనే లేదన్నారు. ఏ1 తెచ్చిన జీవో1ని ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. తమకి అడ్డొస్తే తొక్కుకుని వెళ్లి పోతామన్నారు. మంచి కోసం పోరాడే ధైర్యం తమకు ఉందని చెప్పారు. సైకో పాలనలో అప్పులు.. ఆత్మహత్యలు... సైకిల్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి అని ముక్తాయించారు లోకేష్.

First Published:  27 Jan 2023 9:24 PM IST
Next Story