Telugu Global
Andhra Pradesh

ఏపీ ప్రభుత్వంలో లోకేష్ పాత్ర ఏంటి..? రెడ్ బుక్ సంగతేంటి..?

2014 నుంచి 2019 వరకు ప్రభుత్వంలో పరోక్షంగా అన్ని వ్యవహారాలు చక్కబెట్టిన లోకేష్ కి ఇప్పుడంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు. ఏపీ ప్రభుత్వంలో ఎవరు నెంబర్-2 అంటే చెప్పలేని పరిస్థితి.

ఏపీ ప్రభుత్వంలో లోకేష్ పాత్ర ఏంటి..? రెడ్ బుక్ సంగతేంటి..?
X

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటవబోతోంది. చంద్రబాబు సీఎం అవుతారు, కూటమిలో కీలక నేత పవన్ కల్యాణ్ కి కీలక మంత్రి పదవి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మరి లోకేష్ సంగతేంటి..? పొత్తుల్లేకుండా టీడీపీ అధికారంలోకి వస్తే.. మధ్యలోనే చంద్రబాబు దిగిపోయి లోకేష్ కి రాష్ట్ర పగ్గాలు అప్పగించేవారు. కానీ ఇప్పుడు పొత్తు నియమాలు పాటించాల్సి ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వంలో పరోక్షంగా అన్ని వ్యవహారాలు చక్కబెట్టిన లోకేష్ కి ఇప్పుడంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు. ఏపీ ప్రభుత్వంలో ఎవరు నెంబర్-2 అంటే చెప్పలేని పరిస్థితి. ఈ పొజిషన్లపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో తన పాత్ర ఏంటనేది చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారాయన.


సంక్షేమంతోపాటు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుంటామని, రెండింటినీ జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తామని అన్నారు లోకేష్. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని, దారితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అహర్శిశలు శ్రమిస్తామని చెప్పారు. ప్రజలు తమకు గొప్ప బాధ్యత అప్పగించారని, దాన్ని సక్రమంగా నెరవేరుస్తామన్నారు లోకేష్. మూడు పార్టీలు కలసికట్టుగా పనిచేసి, రాష్ట్రానికి పునర్వైభవం తెస్తామన్నారు.

రెడ్ బుక్ సంగతేంటి..?

మంగళగిరిలో 91వేల పైచిలుకు రికార్డ్ మెజార్టీతో గెలిచిన నారా లోకేష్, పరోక్షంగా రెడ్ బుక్ గురించి కూడా ప్రస్తావించారు. ప్రచారం వేళ చేతిలో రెడ్ బుక్ పట్టుకుని, అధికారుల చిట్టా తయారు చేస్తున్నానంటూ బెదిరిస్తూ మాట్లాడిన ఆయన ఇప్పుడు మాత్రం కాస్త సైలెంట్ అయ్యారు. కక్ష సాధింపులు, వేధింపులు, ఆస్తుల విధ్వంసం తమకు తెలియవని అన్నారు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించబోమని చెప్పారు. తప్పు చేయని వారిపై కక్ష సాధింపులు ఏమీ ఉండవన్నారు లోకేష్. వైసీపీ చేసిన తప్పుల్ని తాము చేయబోమన్నారు లోకేష్.

First Published:  5 Jun 2024 1:16 AM GMT
Next Story