అన్నీ అమిత్ షా కి చెప్పేశా.. ఆయనే నన్ను పిలిచారు
ఏపీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అమిత్ షాకు అన్ని విషయాలు వివరించానన్నారు లోకేష్. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పానన్నారు.
నేనేమీ అమిత్ షా అపాయింట్ మెంట్ అడగలేదు, ఆయనే నన్ను పిలిపించారంటూ గొప్పలు చెప్పుకున్నారు నారా లోకేష్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అమిత్ షా కబురు పెట్టారని, వెంటనే వెళ్లి ఆయన్ను కలిశానన్నారు. నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయిన లోకేష్, ఈరోజు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ భేటీ వివరాలు వెల్లడించారు. అమిత్ షా పిలిస్తేనే తాను వెళ్లానని లోకేష్ చెప్పడం ఇక్కడ పెద్ద ట్విస్ట్.
ఏపీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అమిత్ షాకు అన్ని విషయాలు వివరించానన్నారు లోకేష్. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పానన్నారు. ఆయనకు భద్రతా పరంగా ఉన్న ఆందోళన గురించి కూడా వివరించానని చెప్పారు. సీఐడీ ఎందుకు పిలిచింది, ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారని, అన్నీ రాజకీయ కక్షతో పెట్టిన కేసులేనని తాను చెప్పినట్టు వివరించారు లోకేష్. చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ పాత్ర ఉందని తాను అనుకోవట్లేదని, బీజేపీ నేతల మౌనంతో ఆరోపణలు వచ్చాయనుకుంటున్నానని అన్నారు. నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరానన్నారు లోకేష్.
చంద్రబాబు అరెస్టు వెనుక తాము లేమని అమిత్ షా స్పష్టంగా చెప్పినట్టు మీడియాకు తెలియజేశారు లోకేష్. బీజేపీపై జగన్ నిందలు మోపుతున్నారని అన్నారు. అమిత్‌షా వద్ద ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని, రాష్ట్రం నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నట్టు తెలిసిందని అన్నారు. సీఐడీ రెండో రోజు విచారణలో భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ని తనకి చూపించి పలు ప్రశ్నలు అడినట్టు చెప్పారు లోకేష్. తన తల్లి ఐటీ రిటర్న్ లు సీఐడీ చేతికి ఎలా వచ్చాయనే, అంశంపై సీబీడీటీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరంలోనే ఉన్నామన్నారు లోకేష్.