Telugu Global
Andhra Pradesh

లోకేష్ అరెస్టు తప్పదా?

తన అరెస్టు విషయమై లోకేష్‌కు స్పష్టమైన సమాచారం ఉందేమో. అందుకనే అరెస్టుపై అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలంటే ఎవరినీ పోలీసులు వదిలిపెట్టరు.

లోకేష్ అరెస్టు తప్పదా?
X

నారా లోకేష్ అరెస్టు తప్పదా? ఏమో వీళ్ళ మాటలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే బ్రాహ్మణి మాట్లాడుతూ.. నారా లోకేష్‌ను కూడా అరెస్టు చేస్తారేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఢిల్లీలో లోకేష్ మాట్లాడుతూ.. తనను కూడా అరెస్టు చేస్తారేమో అన్నారు. ఇదివరకు అనంతపురం పర్యటనలో చంద్రబాబు కూడా ఒకటి రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారేమో అని అన్నమాట నిజమైంది.

ఇప్పుడు లోకేష్, బ్రాహ్మణి మాట కూడా నిజమవుతుందేమో. ఎందుకంటే స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ స్కామ్‌లో తండ్రితో పాటు తాను కూడా ఉన్నాన్న విషయం లోకేష్‌కు బాగా తెలుసు. ఎవరి పాత్ర ఎంతో కూడా వాళ్ళకే తెలుసు. ఆధారాలు దొరకగానే సీఐడీ పోలీసులు ముందు చంద్రబాబును అరెస్టు చేసి రిమాండుకు పంపారు. లోకేష్ పాత్రపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐడీ చీఫ్ సంజయ్ గతంలోనే చెప్పారు. బహుశా ఈపాటికే అన్నీ ఆధారాలను సేకరించే ఉంటారనటంలో సందేహంలేదు.

ఒకేసారి తండ్రీకొడుకుల‌ను అరెస్టు చేస్తే గోలైపోతుందని ఓపికపట్టినట్లున్నారు. తన అరెస్టు విషయమై లోకేష్‌కు స్పష్టమైన సమాచారం ఉందేమో. అందుకనే అరెస్టుపై అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలంటే ఎవరినీ పోలీసులు వదిలిపెట్టరు. చంద్రబాబు సంత‌కాలు 13 చోట్ల ఉన్న‌ట్లే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సంతకాలు 5 చోట్ల ఉన్నట్లు సీఐడీ ఆధారాలను కూడా చూపింది.

మరి లోకేష్ పాత్ర ఎంతో ఎవరికీ తెలియ‌దు. నిజంగానే లోకేష్ పాత్రుంటే కచ్చితంగా అరెస్టవుతారు. ఇదే సీఐడీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కుంభకోణాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు. రెండింటిలోనూ లోకేష్ పాత్రపై చాలా ఆధారాలున్నట్లు ఇప్ప‌టికే ప్రచారం జరుగుతోంది. మరి అరెస్టు చేయటానికి సరిపడా ఆధారాలున్నాయని సీఐడీ అనుకుంటే అరెస్టు తప్పదు. బహుశా ఈ విషయాలన్నింటినీ లోకేష్ కూడా ఆలోచించి ఉంటారు. తల్లి, భార్యతో మాట్లాడుకునే ఉంటారు. అందుకనే అరెస్టు గురించి మాట్లాడుతున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

First Published:  17 Sept 2023 11:09 AM IST
Next Story