లేఖ రాసింది చంద్రబాబే.. ఆయన ఆదేశాలతోనే పరామర్శ యాత్ర
ఆ ఆలోచన కూడా తన భర్తదేనంటున్నారు భువనేశ్వరి. చంద్రబాబు ఆదేశాల ప్రకారం తాను పరామర్శ యాత్ర చేస్తున్నట్టు తెలిపారు. తమ్ముడికి ఏమాత్రం క్రెడిట్ ఇవ్వాలనుకోలేదు, ఇవ్వలేదు.
చంద్రబాబు దసరా లేఖపై భువనేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ఆ లేఖ ఆయనే రాశారని చెప్పారు. అయినా దానితో ఇప్పుడు పనేంటని ప్రశ్నించారు. ఆ లేఖపై ఏపీ ప్రభుత్వం రాద్ధాంతం చేయడం బాలేదన్నారు. అసలు ఆ లేఖ చంద్రబాబు రాయలేదని, ఆయనకు అంత పాండిత్యం లేదని, పోనీ లోకేష్ కి కూడా అలా రాసే పరిజ్ఞానం లేదని.. ఎవరో రచయిత రాసిస్తే దానిపై చంద్రబాబు సంతకం పెట్టారంటూ వైరివర్గం విమర్శలు చేస్తున్న వేళ భువనేశ్వరి బాగానే కవర్ చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా.. లేఖపై విచారణ చేస్తూ ఏపీ ప్రభుత్వం సమయం వృథా చేస్తోందని విమర్శించారామె.
బాబు ఆదేశాల ప్రకారం..
బాధిత కుటుంబాల పరామర్శ అనేది వాస్తవానికి బాలకృష్ణ ఆలోచన. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని, చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజే ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు పరామర్శ యాత్ర చేస్తోంది మాత్రం భువనేశ్వరి. బాలయ్యను పక్కనపెట్టి, నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి పరామర్శ యాత్రకు బయలుదేరారు. ఆ ఆలోచన కూడా తన భర్తదేనంటున్నారామె. చంద్రబాబు ఆదేశాల ప్రకారం తాను పరామర్శ యాత్ర చేస్తున్నట్టు తెలిపారు. తమ్ముడికి ఏమాత్రం క్రెడిట్ ఇవ్వాలనుకోలేదు, ఇవ్వలేదు.
చెప్పిందే చెబుతూ..
నిజం గెలవాలి యాత్ర రోజులు గడుస్తున్నా.. ఆశాజనకంగా సాగడంలేదు. చెప్పిందే చెబుతూ భువనేశ్వరి విసుగుతెప్పిస్తున్నారని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. తన భర్తను అన్యాయంగా జైలులో పెట్టారని పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వం కక్షసాధిస్తోందని అంటున్నారు. ఆయన బయటకొస్తారు, అన్నీ చూసుకుంటారని చెబుతున్నారే కానీ.. భవిష్యత్తుపై కార్యకర్తలకు, నాయకులకు ఆమె భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఆయన బయటకు రాకపోతే పరిస్థితి ఏంటి అనేది మాత్రం టీడీపీ నేతల్లో ఎవరికీ క్లారిటీ లేదు.