చంద్రబాబు మేనిఫెస్టోకే దిక్కులేదు.. భువనేశ్వరి హామీనా..?
అన్న క్యాంటీన్లను రాజకీయం చేసిందే చంద్రబాబు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అన్న క్యాంటీన్లను ప్రకటించారు. అయితే 2018 చివరలో మాత్రమే క్యాంటీన్లను మొక్కుబడిగా ప్రారంభించారు.
ఈ ఏడాది తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాగానే వెంటనే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తారని నారా భువనేశ్వరి ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అడ్డుకున్నా.. రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు సొంత ఖర్చులతో 140 క్యాంటీన్లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2018లో చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన 300 అన్న క్యాంటీన్లలో రోజుకు సగటున 3 లక్షలమంది ఆకలి తీర్చుకున్నట్లు భువనేశ్వరి చెప్పారు. దుగ్గిరాల మండలంలో అన్నాక్యాంటీన్ను భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. అన్న క్యాంటీన్లను రాజకీయం చేసిందే చంద్రబాబు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అన్న క్యాంటీన్లను ప్రకటించారు. అయితే 2018 చివరలో మాత్రమే క్యాంటీన్లను మొక్కుబడిగా ప్రారంభించారు. అదికూడా అచ్చంగా టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు, నేతల ఉపాధి కోసమే అన్నట్లుగా జరిగింది. ఎలాగంటే.. 10 లక్షల రూపాయలతో అయిపోయే నిర్మాణాలకు సగటున రూ.50 లక్షలు చెల్లించారు. ఇక్కడే పెద్ద కుంభకోణానికి తెరలేచింది. ఇక భోజనం ఖరీదులో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్లేటుకు 5 రూపాయలు ఖర్చు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం 17 రూపాయలు చెల్లించింది.
సరే ఎవరెంత తిన్నా ఎంతోకొంతమంది పేదలకు కడుపు నిండింది కదా అనుకుంటే నిండిందనే సమాధానం చెప్పాలి. కానీ, అన్నక్యాంటీన్ గదులను పార్టీ నేతలు తమ అడ్డాలుగా మార్చుకున్నారు. కొన్నింటిని మురికి కాల్వల పక్కన, శ్మశానాల పక్కన ఏర్పాటుచేయటంతో అక్కడ జనాలు భోజనాలు చేయటానికి నిరాకరించారు. అయినా సరే రోజూ వందల ప్లేట్లు లెక్కచెప్పి ప్రభుత్వం దగ్గర నుండి పెద్ద మొత్తంలో బిల్లులు వసూళ్ళు చేసుకున్నారు.
అన్నక్యాంటీన్ల ముసుగులో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. మేనిఫెస్టోలో హామీఇచ్చిన చంద్రబాబుకే పథకం అమలులో చిత్తశుద్ధిలేదు. అలాంటిది క్యాంటీన్లను కంటిన్యూ చేయాలన్న కమిట్మెంట్ జగన్ ప్రభుత్వానికి ఎందుకుంటుంది..? నిజంగానే పేదల్లో కొంతమంది అన్న క్యాంటీన్ల ద్వారా కడుపు నింపుకోవటం నిజమే. అదే సమయంలో పేదల ఆకలితీర్చే ముసుగులో కొందరు పెద్దలు ప్రజాధనాన్ని స్వాహా చేశారన్నది కూడా అంతే నిజం. అయినా చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టోలోనే అన్న క్యాంటీన్లకు దిక్కులేదు ఇక భువనేశ్వరి హామీ లెక్కేంటి ? అయినా ఏ హోదాలో భువనేశ్వరి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై హామీ ఇచ్చారు ?