తెలుగుదేశంలో యాక్టివ్ అవుతున్న నందమూరి ఫ్యామిలీ
నందమూరి రామకృష్ణ కూడా రాజకీయాలకు సంబంధించిన స్టేట్‌మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపుపై రామకృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
తెలుగుదేశం పార్టీలో సరికొత్త సమీకరణాలు వేడి పుట్టిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతిని సంయుక్తంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఏడాది పాటు ఈ ఉత్సవాలు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ అంటే ఒకప్పుడు నందమూరి తారకరామారావు మాత్రమే. ఇప్పుడు టీడీపీ అంటే నారా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ మాత్రమే అన్న చందంగా పరిస్థితులు మారిపోయాయి. నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ బదిలీ అయిపోయింది.
చాలా ఏళ్లుగా తెలుగుదేశం పార్టీతో అంటీ ముట్టనట్టు ఉన్న నందమూరి కుటుంబం ఇటీవల తెరపైకి తరచూ వస్తోంది. తెలుగుదేశంలో తమ ఉనికి చాటుకునే ప్రయత్నాలు ఆరంభించిందా అనే అనుమానాలు వస్తున్నాయి. టీడీపీతో ప్రస్తుతం ఎక్కువగా నందమూరి బాలకృష్ణ ఒక్కరే అసోసియేట్ అయి ఉన్నారు. ఆయన కూడా తన అల్లుడు లోకేష్ కావడంతో తప్పనిసరై పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తారు. మిగతా నందమూరి కుటుంబసభ్యులెవరూ యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరు.
ఇటీవల పరిణామాలు చూస్తుంటే నందమూరి కుటుంబం తెలుగుదేశంలో తమకి తగిన ప్రాధాన్యం కావాలని కోరుకుంటోందని అర్థం అవుతోంది. రాష్ట్రంలో చాలాచోట్ల జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇవ్వాలనే ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు జూనియర్ ఎన్టీఆర్‌దే తెలుగుదేశం పార్టీ అని, ఆయన్ను పార్టీలోకి లోకేష్ ఆహ్వానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో మృతిచెందిన నందమూరి తారకరత్న తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని ప్రకటించారు. టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తానని చెప్పిన ఆయన కోరిక తీరకుండానే కన్నుమూశారు.
మరో వైపు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తెలంగాణ తెలుగుదేశం రాజకీయాల నుంచి ఏపీ వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కోస్తా ఆంధ్రలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని, చిలకలూరిపేట నుంచి బరిలోకి దిగొచ్చని ప్రచారం సాగుతోంది. నందమూరి బాలకృష్ణ ఈసారి కూడా హిందూపురం నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు నందమూరి రామకృష్ణ కూడా రాజకీయాలకు సంబంధించిన స్టేట్‌మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపుపై నందమూరి రామకృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. రామకృష్ణ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాలని ఆశిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ కూడా గత కొద్దిరోజులుగా ఏపీలోని వివిధ నియోజకవర్గాలకి తరచూ వస్తున్నారు. తెలుగుదేశం కేడర్‌తో కలుపుగోలుగా ఉంటున్నారు. ఇటీవలే సొంత బ్యానర్ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పై నిర్మించే సినిమాలో హీరోగా కూడా యాక్ట్ చేస్తున్న చైతన్యకృష్ణ పాలిటిక్స్‌లో దిగాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లోనూ టీడీపీ గెలవడం, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నిర్ణయించుకున్న నందమూరి ఫ్యామిలీ.. టీడీపీ నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారని తెలుస్తోంది.