అన్నయ్యా అది చాలు, ఇక మేం చూసుకుంటాం..
ఈమాత్రం సపోర్ట్ చాలన్నయ్యా అంటున్నారు నాగబాబు. చిరంజీవి చెప్పిన మాటలు కోట్లాది మంది తమ్ముళ్ల మనసులు గెలుచుకున్నాయని అన్నారు.
గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన చిరంజీవి, పవన్ కల్యాణ్ రాజకీయాలపై చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన కర్ర విరగకుండా, పాము చావకుండా చాలా తెలివిగా మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు బాగుందా లేదా అనేది చెప్పకుండానే పవన్ కి ప్రజలు అవకాశమిస్తారని అన్నారు. తామిద్దరం రాజకీయాల్లో చెరోవైపు ఉండటం బాగోదనే తను తమ్ముడికోసం తప్పుకున్నానని అన్నారు చిరు. మొత్తమ్మీద పవన్ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అన్నారు కాబట్టి, కచ్చితంగా చిరంజీవి పవన్ ని సపోర్ట్ చేశారని, జనసేనకు మద్దతిచ్చారని అంటున్నారు. ఈమాత్రం సపోర్ట్ చాలు అన్నయ్యా ఇక చెలరేగిపోతాం అంటూ నాగబాబు కూడా బయటకొచ్చారు.
అది చాలన్నయ్యా..!
ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ని చిరంజీవి బహిరంగంగా సమర్థించలేదు. గతంలో ఓసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు కానీ అంతలోనే సర్దుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు. ఇప్పుడు కూడా ఆయన చాలా బ్యాలెన్స్ డ్ గా మాట్లాడారు. ఈమాటలతో జనసైనికులు సంతోషంలో ఉన్నారు. ఈమాత్రం సపోర్ట్ చాలన్నయ్యా అంటున్నారు నాగబాబు. చిరంజీవి చెప్పిన మాటలు కోట్లాది మంది తమ్ముళ్ల మనసులు గెలుచుకున్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్ధత గల నాయకుడు పగ్గాలు చేపట్టాలన్నదే చిరంజీవి ఆకాంక్ష అని అన్నారాయన. తప్పకుండా అది నెరవేరుతుందని, జనసైనికులుగా తామంతా ఈ కార్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు నాగబాబు.
చిరుమాటలతో ధైర్యం..
పవన్ గురించి చిరు చెప్పిన మాటలు.. తనకు చిన్నప్పటి నుంచి తెలుసని.. అయితే ఆ మాటలతో ఇప్పుడు జన సైనికులకు, వీర మహిళలకు ఎంతో మనో ధైర్యం వచ్చిందన్నారు నాగబాబు. చిరంజీవి మాటలకు అనుగుణంగా జనసైనికులంతా మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందాలని పిలుపునిచ్చారు నాగబాబు. మొత్తమ్మీద అటు గాడ్ ఫాదర్ ప్రమోషన్ తోపాటు, ఇటు జనసేన రాజకీయాలకు కూడా ఓ ప్రమోషన్ దొరికిందని సంబరపడుతున్నారు జనసైనికులు.