Telugu Global
Andhra Pradesh

ప్రశ్నిస్తే మండిపోతోందా?

పొత్తుల విషయంపై నేతలెవరూ మాట్లాడొద్దని, పవన్‌ను ప్రశ్నించాల్సిన అవసరంలేదని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. యలమంచలి పార్టీ ఆఫీసు ప్రారంభం సందర్భంగా నేతలతో మాట్లాడుతూ.. పొత్తుల విషయాన్ని పవన్‌కు వదిలేసి మిగిలిన పనులను చూసుకోమని నేతలకు చెప్పారు.

ప్రశ్నిస్తే మండిపోతోందా?
X

జనసేన పార్టీ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ప్రశ్నించటానికే పార్టీని పెట్టినట్లు అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతుంటారు. పవన్ సోదరుడు నాగబాబు ఏమో పవన్‌ను ఎవరూ ప్రశ్నించొద్దని, జస్ట్ చెప్పిన పని చెప్పినట్లు చేసుకుపోవాలని గట్టిగా హెచ్చరించారు. పొత్తుల విషయంపై నేతలెవరూ మాట్లాడొద్దని, పవన్‌ను ప్రశ్నించాల్సిన అవసరంలేదని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. యలమంచలి పార్టీ ఆఫీసు ప్రారంభం సందర్భంగా నేతలతో మాట్లాడుతూ.. పొత్తుల విషయాన్ని పవన్‌కు వదిలేసి మిగిలిన పనులను చూసుకోమని నేతలకు చెప్పారు.

అంటే ఇదే విషయాన్ని గతంలో పవన్ కూడా చెప్పారు. పొత్తుల గురించి అనవసరంగా ఎవరంటే వాళ్ళు మాట్లాడొద్దని హెచ్చరిక చేశారు. అంటే ఇక్కడ అర్థ‌మవుతున్నది ఏమిటంటే పవన్ మాత్రం ఎవరినైనా ప్రశ్నించచ్చు. అయితే పవన్‌ను మాత్రం ఎవరు ఏమీ ప్రశ్నించకూడదు. ఇది, పార్టీలో పవన్, నాగబాబు కోరుకునే ప్రజాస్వామ్యం. పార్టీ నేతల సమాచారం ఏమిటంటే పొత్తులపై వెంటనే ఏదో ఒక విషయాన్ని తేల్చాలని నేతలు పదేపదే పవన్, నాగబాబుపై ఒత్తిడి తెస్తున్నారట.

సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్న పవన్ అందరికీ అందుబాటులో ఉండరు కాబట్టి చాలామంది నేతలు నాగబాబునే అడుగుతున్నారట. పొత్తులపై ఏదో ఒకటి తేల్చమని నేతలు ఒత్తిడి పెడితే నాగబాబు ఏమి సమాధానం చెప్పగలరు. చెప్పాల్సింది, తేల్చాల్సింది అంతా పవనే కదా. సినిమా బిజీలో ఉండే పవన్‌కు ప్రస్తుతానికి రాజకీయాల గురించి ఆలోచించేంత సమయం ఉండటంలేదు.

అలాగే పొత్తులపై ఏమిచేయాలో అయోమయం పెరిగిపోతోంది. పొత్తును తెంచుకుంటే బీజేపీకి కోపమొస్తుంది. అలాగని బీజేపీని వదిలేయకపోతే టీడీపీతో పొత్తు సాధ్యంకాదు. టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పిందామని ప్రయత్నించి ఫెయిలయ్యారు. కాబట్టి పొత్తులపై ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో అవస్తలుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై ఏదోకటి తేల్చమని నేతలు ఒత్తిడిపెడుతుంటే చికాకు ఫీలవుతున్నట్లున్నారు. నాగబాబు హెచ్చరికల్లో అందరికీ అదే అర్థ‌మవుతోంది. అందుకనే పొత్తులపై తమను ఎవరు ప్రశ్నించవద్దని, తమతో ఎవరు మాట్లాడవద్దని నాగబాబు తెగేసిచెప్పింది. మొత్తానికి పొత్తులపై చర్చలంటేనే సోదరులిద్దరికీ మండిపోతున్నట్లు అర్థ‌మవుతోంది.

First Published:  10 May 2023 10:31 AM IST
Next Story