Telugu Global
Andhra Pradesh

వైనాట్ పులివెందుల..? నాగబాబుకి గట్టిగా ఇచ్చేసిన అంబటి

సాక్షాత్తూ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఓట్లు పడలేదని టీడీపీ నేతలు వెటకారం చేస్తున్నారు. దీన్ని ఇంకాస్త ఘాటుగా మార్చారు నాగబాబు. “వైనాట్ పులివెందుల..?” అంటూ ట్వీట్ చేశారు.

వైనాట్ పులివెందుల..? నాగబాబుకి గట్టిగా ఇచ్చేసిన అంబటి
X

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన నుంచి అధికారిక స్పందన రాలేదు. టీడీపీ నేతల్ని అభినందిస్తూనో, వైసీపీని విమర్శిస్తూనో జనసేన తరపున ప్రెస్ నోట్లు ఏవీ విడుదల కాలేదు. నాయకుల వ్యక్తిగత స్పందన కూడా పెద్దగా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో నాగబాబు మాత్రం కాస్త వెటకారంగా స్పందించారు. సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ ఆయన “వైనాట్ పులివెందుల..?” అంటూ ట్వీట్ చేశారు.


సీఎం జగన్ ఇటీవల వైనాట్ 175 అంటూ వైసీపీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఒక్కటి కూడా చేజారకుండా ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో మనమే గెలవాలి అంటూ నాయకులకు ఉద్భోదిస్తున్నారు జగన్. అయితే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ సొంత జిల్లా కడపలో కూడా వైసీపీకి మెజార్టీ రాలేదు. సాక్షాత్తూ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఓట్లు పడలేదని టీడీపీ నేతలు వెటకారం చేస్తున్నారు. దీన్ని ఇంకాస్త ఘాటుగా మార్చారు నాగబాబు. “వైనాట్ పులివెందుల..?” అంటూ, ఆ సీటుని కూడా ప్రతిపక్షాలు చేజిక్కించుకుంటాయి అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.

అంబటి కౌంటర్..

నాగబాబు ట్వీట్ కి అంబటి ఇంకాస్త ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. “ప్యాకేజీ పిల్లి.. కూతలు” అంటూ నాగబాబుని ట్యాగ్ చేశారు. ప్యాకేజీ ముట్టిన తర్వాత నాగబాబు ఇలాంటి ట్వీట్లు వేస్తుంటారనే అర్థం వచ్చేట్టు అంబటి కౌంటర్ ఇచ్చారు. మొత్తమ్మీద.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో టీడీప వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మధ్యలో జనసేన కూడా తలదూర్చే సరికి.. నాగబాబుకి గట్టిగానే బదులిచ్చారు మంత్రి అంబటి రాంబాబు.



First Published:  19 March 2023 5:43 PM IST
Next Story