Telugu Global
Andhra Pradesh

పవన్ కి సలహాలివ్వొద్దు.. జనసైనికులకు నాగబాబు ఉచిత సలహా

ఏపీ ప్రజల్లో చైతన్యం మొదలైందని చెప్పారు నాగబాబు. గత ఎన్నికల్లో జనసేనకు 7 శాతం ఓట్లు రాగా... ఇప్పుడు మద్దతిచ్చేవారి శాతం 35కు పెరిగినట్టు తమ సర్వేలు చెబుతున్నాయని అన్నారు నాగబాబు.

పవన్ కి సలహాలివ్వొద్దు.. జనసైనికులకు నాగబాబు ఉచిత సలహా
X

పవన్ కల్యాణ్ కి ఎవరూ సలహాలివ్వొద్దని, ఆయన నిర్ణయాన్ని గౌరవిద్దామని జనసైనికులకు పిలుపునిచ్చారు నాగబాబు. టీడీపీ, జనసేన పొత్తులపై కూడా ఎవరూ చర్చించుకోవద్దని సూచించారు. జనసేన తరపున ఎవరు పోటీ చేస్తే వారిని గెలిపించడమే మీ పని అని జనసైనికులకు ఉపదేశమిచ్చారు. పొత్తుల గురించి జనసైనికులు వర్రీ అవ్వొద్దని, ఆ విషయం పవన్ చూసుకుంటారని, పొత్తుల విషయంలో పవన్ కి ఎవరూ సలహాలివ్వాల్సిన పనిలేదని, ఆయన తీసుకునే నిర్ణయాన్ని అందరూ గౌరవిద్దామన్నారు.

నాగబాబు హడావిడి..

ఇప్పటి వరకూ జనసేన అంటే పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే కనిపించేవారు. అప్పుడప్పుడు నాగబాబు హడావిడి ఉన్నా కూడా ఆయన రోజుల తరబడి సైలెంట్ అయిపోయేవారు. ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపించేవారు. ఇటీవల నాగబాబుకి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో ఆయన హడావిడి మళ్లీ పెరిగింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

ప్రజల్లో చైతన్యం మొదలైంది..

ఏపీ ప్రజల్లో చైతన్యం మొదలైందని చెప్పారు నాగబాబు. గత ఎన్నికల్లో జనసేనకు 7 శాతం ఓట్లు రాగా... ఇప్పుడు మద్దతిచ్చేవారి శాతం 35కు పెరిగినట్టు తమ సర్వేలు చెబుతున్నాయని అన్నారు నాగబాబు. పార్టీకి మహిళలు ఆక్సిజన్‌ లాంటివారని, వీర మహిళలు ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలతో జనంలోకి వెళ్లాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇప్పిస్తామన్నారు నాగబాబు.

First Published:  8 May 2023 9:07 AM IST
Next Story