మెగా అభిమానుల్ని దువ్వుతున్న నాగబాబు..
"సినిమాలు విడుదలైనప్పుడే మనం మెగా ఫ్యాన్స్... మిగిలిన సమయంలో జన సైనికులం, వీర మహిళలం" అంటూ కర్తవ్యబోధ చేశారు నాగబాబు.
ప్రజారాజ్యం టైమ్ లో మెగా స్టార్ అభిమానుల్ని ఒకచోటకు చేర్చి.. వారిని ఓటుబ్యాంకుగా మార్చేందుకు కృషిచేసిన వారిలో నాగబాబు కూడా ఒకరు. అయితే ప్రజారాజ్యం ఫ్లాప్ షో తర్వాత పార్టీకోసం కష్టపడిన మెగా అభిమానులకు న్యాయం జరగలేదనేది బహిరంగ రహస్యం. అందుకే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినా.. చాలామంది అంటీముట్టనట్టుగానే ఉన్నారు. కేవలం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే జనసేనకు కనెక్ట్ అయ్యారు. మెగాస్టార్ డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరూ ఆవైపు చూడటంలేదు. ఇప్పుడు మెగా అభిమానులందర్నీ మళ్లీ ఒకే చోటకు చేర్చేందుకు ప్లాన్ గీస్తున్నారు నాగబాబు. తాజాగా అనకాపల్లిలో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. "సినిమాలు విడుదలైనప్పుడే మనం మెగా ఫ్యాన్స్... మిగిలిన సమయంలో జన సైనికులం, వీర మహిళలం" అంటూ కర్తవ్యబోధ చేశారు. కనీసం మీటింగ్ హాల్ లో కుర్చీలు కూడా నిండకపోవడం వేరే విషయం.
వైసీపీని గద్దె దించడానికి మరో రెండు నెలలు కష్టపడదాం
— JanaSena Party (@JanaSenaParty) February 18, 2024
* రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
* సినిమాలు విడుదలైనప్పుడే మనం మెగా ఫ్యాన్స్... మిగిలిన సమయంలో జన సైనికులం,
వీర మహిళలం
* వచ్చేది జనసేన- తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమే
* మన ప్రభుత్వంలో సంక్షేమ… pic.twitter.com/qNY60tK5c7
జనసేనకు దూరంగా మెగా ఫ్యాన్స్..
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ లోనే రెండు మూడు వర్గాలున్నాయి. చిరంజీవి ఫ్యాన్స్ చాలామంది రామ్ చరణ్ కు షిఫ్ట్ అయ్యారు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సెపరేట్ గానే ఉన్నారు. అటు బన్నీ ఫ్యాన్స్ మరో వర్గంగా ఉన్నారు. వీరందర్నీ కలపడం అసాధ్యమే అయినా నాగబాబు మాత్రం ఎన్నికల ముందు హడావిడి చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలప్పుడే నాగబాబుకి మెగా ఫ్యాన్స్ గుర్తు రావడం విశేషం.
ఉత్తరాంధ్రలో నాగబాబు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన అనకాపల్లి సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశాల పేరుతో జనంలోకి వెళ్తున్నారు. ఆమధ్య తాను ఎన్నికల్లో పోటీ చేయను, వెనక ఉండి నడిపిస్తానంటూ డైలాగులు కొట్టిన నాగబాబు.. ఇటీవల మళ్లీ మనసు మార్చుకున్నారు. తాను పోటీ చేయబోనని ఎక్కడా చెప్పలేదన్నారు. అంటే నాగబాబు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారనమాట. అయితే టీడీపీపై పదే పదే ట్విట్టర్లో జోకులు పేల్చే నాగబాబుకి పొత్తులో ఉన్నా సరే ఆ పార్టీ ఓట్లు కలసి రావు. పైగా బాలకృష్ణ అభిమానులకి కూడా నాగబాబు అంటే పడదు. సో.. నాగబాబు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా ఆయన గెలుపు అసాధ్యం. అసలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణే.. గెలిచే సీటు తెలియక, ఇంకా సర్వేలు చేయించుకుంటూ సతమతమవుతున్నారు. మరి నాగబాబు హడావిడి ఎంతకాలమో వేచి చూడాలి.