రూటు మార్చిన నాగబాబు.. జిల్లా పర్యటనలకు ఫుల్ స్టాప్
చిత్తూరు జిల్లాతో మొదలుపెట్టిన పర్యటనలను, చిత్తూరు జిల్లాతోనే ఆపేశారు. జూమ్ మీటింగ్ లతో ప్రత్యామ్నాయం వెదుక్కున్నారు నాగబాబు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నాగబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ఆ తర్వాత ఆయన పర్యటన పూర్తిగా రద్దయింది. తాజాగా ఆయన జూమ్ మీటింగ్ తో సరిపెట్టారు. మిగతా నాయకుల కోసం తన సందేశం వినిపిస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. జిల్లా పర్యటనలకు రాలేనంత బిజీగా నాగబాబు ఉన్నారనుకోలేం. కానీ ఆయన వస్తే పరిస్థితి మరోలా ఉంటుందనే అనుమానం ఎక్కడో వెనక్కు లాగింది. అందుకే ఆయన నేరుగా జిల్లాలకు రావట్లేదు, జూమ్ మీటింగ్ లతోనే సరిపెడుతున్నారని స్పష్టమైంది.
ఆ మధ్య విదేశీ పర్యటనలతో బిజీగా గడిపిన నాగబాబు.. ఇటీవల ఏపీలో కూడా పర్యటనలు మొదలుపెట్టారు. జనసేన-టీడీపీ పొత్తు ఖరారైన తర్వాత తొలిసారిగా ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఆ మీటింగ్ లోనే టీడీపీపై జనసైనికుల్లో ఉన్న వ్యతిరేకత బయటపడింది. వారిని బుజ్జగించేందుకు నాగబాబు కూడా మనసులో మాటలు బయటపెట్టారు. టీడీపీకి మన అవసరం ఉంది, అధికారంలోకి వచ్చాక మనదే పెత్తనం అని తేల్చి చెప్పారు. ఇదంతా బయటకు రావడంతో ఆ తర్వాత నాగబాబు ఇబ్బందిపడ్డారు. ఏ జిల్లాకు వెళ్లినా ఇదే పరిస్థితి రిపీటవుతుంది. సీట్ల విషయంలో కుమ్ములాటలు మొదలవుతాయి. టీడీపీతో కలసి వెళ్లడానికి కేడర్ ఇష్టపడటం లేదని అర్థమవుతుంది. ఈ గొడవంతా ఎందుకని చిత్తూరు జిల్లాతో మొదలుపెట్టిన పర్యటనలను, చిత్తూరు జిల్లాతోనే ఆపేశారు. జూమ్ మీటింగ్ లతో ప్రత్యామ్నాయం వెదుక్కున్నారు నాగబాబు.
బిగ్గెస్ట్ డెవిల్స్ తో యుద్ధం..
నెల్లూరు జిల్లా నేతల జూమ్ మీటింగ్ లో కూడా టీడీపీ పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు నాగబాబు. బిగ్గెస్ట్ డెవిల్స్ తో మనం యుద్ధం చేస్తున్నామని, కలిసికట్టుగా పోరాటం చేయకపోతే వైసీపీని గద్దె దించలేమని నాయకులకు స్పష్టం చేశారు. పొత్తు స్ఫూర్తి దెబ్బ తీసేలా ఎవరూ మాట్లాడొద్దని హితవు పలికారు. ప్రకృతి వనరులను వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోచేస్తున్నారని, కేసులకు భయపడి పోరాటం ఆపొద్దని సూచించారు. పార్టీలో ఎవరూ ఎక్కువ కాదని, అలాగని ఎవరినీ తక్కువ చేయబోమని చెప్పారు నాగబాబు. అందరూ కలసి నడవాలన్నారు. మొత్తమ్మీద నేరుగా మీటింగ్ లు పెడితే.. రచ్చ రచ్చేనని తేలడంతో.. నాగబాబు జూమ్ ద్వారా సేఫ్ గేమ్ మొదలుపెట్టారు.