పొత్తు ఖరారైనట్టేనా.. నాగబాబు వ్యాఖ్యల మర్మమేంటి..?
ఎంత పక్క పార్టీ నేత అయినా చంద్రబాబుని, నాగబాబు ఎప్పుడూ పొగడలేదు, అలాగని తిట్టనూ లేదు. అయితే ఇప్పుడాయన చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకోవడం విశేషం.
టీడీపీ, జనసేన పొత్తు ఇంకా అఫిషియల్ గా కన్ఫామ్ కాలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ తర్వాత పొత్తు గురించి ఎవరూ స్పందించలేదు. ఆ మాటకొస్తే పొత్తు చర్చలే తమ మధ్య జరగలేదని అంటున్నాయి రెండు పార్టీలు. అయితే నాగబాబు ఈరోజు చేసిన వ్యాఖ్యలు మాత్రం 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
నాగబాబు ఏమన్నారు..?
ఎంత పక్క పార్టీ నేత అయినా చంద్రబాబుని, నాగబాబు ఎప్పుడూ పొగడలేదు, అలాగని తిట్టనూ లేదు. అయితే ఇప్పుడాయన చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకోవడం విశేషం. జీవో నెంబర్-1 గురించి మాట్లాడుతూ నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని ఎంత ఆపితే వారు అంత పైకి లేస్తారని చెప్పారు. జీవో నెంబర్-1ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే, ప్రజేల తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
విమర్శలు తప్ప పనేమీ లేదా..?
ఏపీ మంత్రులకు విమర్శలు చేయడం తప్ప వేరే పనేమీ లేదా అని ప్రశ్నించారు నాగబాబు. శ్రీకాకుళం రణస్థలంలో జనసేన తలపెట్టిన యువశక్తి కార్యక్రమ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. యువత తమ అలోచన, ఆవేదన చెప్పడానికి ఈ సభ మంచి అవకాశమని పేర్కొన్నారు. యువత చాలా పవర్ ఫుల్ అని, ఈ సభను యువత ఒక అవకాశంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం జనసేన పార్టీ కంకణం కట్టుకుందన్నారు. జనసేన గురించి చెప్పడం, పవన్ కల్యాణ్ గురించి పొగడటం ఎప్పుడూ ఉండేదే అయినా ఈసారి చంద్రబాబు గురించి నాగబాబు చెప్పిన మాటలే కాస్త కలకలం రేపాయి. పొత్తులు ఖరారైపోయాయనే ఊహాగానాలు వినపడుతున్నాయి.