పవన్ లేని సమయంలో పని పూర్తి చేస్తున్న నాదెండ్ల
తెనాలిలో ముందుగానే నాదెండ్ల గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకే వస్తుందనే సంకేతాలు పంపిస్తున్నారు.
అక్టోబర్ 5నుంచి వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు పవన్ కల్యాణ్. వాస్తవానికి ఆయన ఈ రోజు ఇటలీకి బయలుదేరాల్సి ఉంది. అయితే ఇటలీ టూర్ కంటే ముందే పవన్ మంగళగిరి ఆఫీస్ కి రావడం ఆపేశారు. రాజకీయాలకు బాగానే గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో తన పని పూర్తి చేస్తున్నారు నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఆయన పర్యటనలు స్పీడందుకున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో తెనాలి సీటు కోసం ఆశగా ఎదురు చూస్తున్న నాదెండ్ల.. ముందుగానే ప్రచారం మొదలు పెట్టారు. తెనాలిలో గడప గడప తిరుగుతున్నారు.
పవన్ కల్యాణ్ ఏపీలో ఉంటే ఆయనతోనే నాదెండ్ల మనోహర్ ఉండాల్సిన పరిస్థితి. ఆయన లేకపోతే పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉండాలి. కానీ ఇప్పుడు నాదెండ్ల ఫోకస్ అంతా తెనాలిపైనే ఉంది. తెనాలిలో ఈసారి ఎలాగైనా గెలవాలనేది ఆయన తాపత్రయం. అందుకే టీడీపీతో పొత్తు విషయంలో పవన్ కంటే ఎక్కువ తొందరపడ్డారు నాదెండ్ల. ఆ తర్వాత చంద్రబాబుని ప్రసన్నం చేసుకోడానికి కూడా ఆయన తెగ కష్టపడుతున్నారు. అవకాశం ఉంటే పవన్ తోపాటు ములాఖత్ కి కూడా వెళ్లాలనుకున్నా అది సాధ్యం కాలేదు. ఈలోగా తెనాలిలో పనులు చక్కబెట్టుకుంటున్నారు. జనసైనికులతో కలసి బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు.
నా సీటు గెలిస్తే చాలు..
పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ ఏ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తెనాలి నియోజకవర్గాన్ని మాత్రం సాధించాలనుకుంటున్నారు నాదెండ్ల. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎక్కడ గెలిచినా, గెలవకపోయినా.. కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా తెనాలి సీటు మాత్రం గెలిచి తీరాలనేది నాదెండ్ల మనోహర్ పట్టుదల. కూటమి కుదిరిన తర్వాత జనసేనలో అందరికంటే ఎక్కువగా సంతోషించింది కూడా ఆయనే. టీడీపీతో సమన్వయం చేసుకునే కమిటీలో కూడా ముఖ్య భూమిక ఆయనదే. అందుకే తెనాలిలో ముందుగానే నాదెండ్ల గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకే వస్తుందనే సంకేతాలు పంపిస్తున్నారు.
♦