Telugu Global
Andhra Pradesh

ఎయిర్ పోర్ట్‌లో రాళ్ల దాడి.. నాదెండ్ల ఎగతాళి..

మంత్రులపై దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని అన్నారు. కనీసం దాడిని కూడా ఆపలేని పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు నాదెండ్ల.

ఎయిర్ పోర్ట్‌లో రాళ్ల దాడి.. నాదెండ్ల ఎగతాళి..
X

విశాఖలో మంత్రుల కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి గురించి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యంగ్యంగా స్పందించారు. రాళ్ల దాడి కేవలం ఓ డ్రామా అన్నట్టుగా మాట్లాడారు నాదెండ్ల. పవన్ కల్యాణ్ పర్యటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ నేతలే ఇలా నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. దాడి చేసింది జనసేనవాళ్లేనని పోలీసులు ఇంకా నిర్థారించలేదని చెప్పారు. దాడి సమయంలో అక్కడ జనసైనికులు ఉన్నమాట వాస్తవమేనని, కానీ వారు దాడి చేయలేదని, వైసీపీ నేతలే దాడికి పథక రచన చేసి, ఆ తప్పుని తమపై నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

కోడికత్తి సంగతేంటి.. ?

గతంలో విశాఖ ఎయిర్ పోర్ట్‌లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడికత్తి దాడి జరిగిందని గుర్తు చేశారు నాదెండ్ల. అప్పటి ఆ దాడి కేసు ఏమైందో ఇప్పటి వరకూ ఎవరూ తేల్చలేదని, కోడి కత్తి తరహాలోనే ఇప్పుడు రాళ్ల దాడి జరిగిందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మంత్రులపై దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని అన్నారు. కనీసం దాడిని కూడా ఆపలేని పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు నాదెండ్ల.

నామ మాత్రంగా బందోబస్తు..

పవన్ కల్యాణ్ పర్యటనకు బందోబస్తు కల్పించాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి జనసేన తరపున లేఖ రాశామని, కానీ ఆయన నామ మాత్రంగా బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పారు నాదెండ్ల. దాడులు జనసేన సంస్కృతి కాదని, దాడులను తాము ప్రోత్సహించబోమని తేల్చి చెప్పారు. దాడి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. జనసేన మాత్రం ఆ ఘటనను లైట్ తీసుకోవడం, పైగా వట్టి డ్రామాగా తేల్చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తమపై తామే దాడి చేసుకుని దాన్ని జనసైనికులపై నెట్టాలని చూస్తున్నారని నాదెండ్ల చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. వైసీపీ నుంచి కూడా గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. మరి ఈ దాడిని.. అప్పట్లో టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడి లాగా పోలీసులు లైట్ తీసుకుంటారా.. లేదా కారకులపై కఠిన చర్యలు తీసుకుంటారా.. వేచి చూడాలని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

First Published:  15 Oct 2022 8:41 PM IST
Next Story