Telugu Global
Andhra Pradesh

ఆడలేక మద్దెల ఓడు.. ఆర్టీసీపై నాదెండ్ల అక్కసు

పోలింగ్ సామగ్రి, సిబ్బందిని తరలించేందుకు ఆర్టీసీ పెద్ద సంఖ్యలో బస్సుల్ని కేటాయించింది. దీంతో సహజంగానే ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్య తగ్గింది.

ఆడలేక మద్దెల ఓడు.. ఆర్టీసీపై నాదెండ్ల అక్కసు
X

ఎన్నికల ప్రచారం పూర్తయింది, ఓటరు తన మనసుకి నచ్చిన పార్టీని, రాష్ట్రాభివృద్ధికి అనువైన పార్టీని ఎన్నుకోవాల్సిన సమయం ఇది. ఈ దశలో ప్రత్యేకంగా ఓ పార్టీ సానుభూతి పరులంటూ ఎవరినైనా గుర్తించగలమా..? గుర్తించి వారికి ప్రత్యేకించి హాని చేసే అవకాశం ఉంటుందా..? నాదెండ్ల మనోహర్ మాత్రం ఏపీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఆర్టీసీ అలా వివక్ష చూపెడుతోందని విమర్శిస్తున్నారు.

నాదెండ్ల ఏమన్నారంటే..?

సీఎం జగన్ సభలకు ఏపీఎస్ఆర్టీసీ ఆఘమేఘాల మీద బస్సులు సమకూర్చుతుందని, కానీ ఇప్పుడు ఎన్నికలకోసం ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారికి మాత్రం బస్సులను అందుబాటులో ఉంచడంలేదని మండిపడ్డారు నాదెండ్ల. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఓటు వేసేందుకు ఏపీకి వస్తున్న వారికి అవసరమైన బస్సులు ఏర్పాటు చేయలేదని అంటున్నారు. ప్రయాణికుల్ని ఆర్టీసీ ఇబ్బంది పెడుతోందని, వారి ఉత్సాహాన్ని నీరుగారుస్తోందని విమర్శించారు.

ఎవరికి నష్టం..?

సీఎం సభలతో పోలిక పెట్టారు కాబట్టి, ఇక్కడ ఆర్టీసీ సంస్థ వైసీపీ నేతల చెప్పుచేతల్లో పనిచేస్తోందనేది నాదెండ్ల వాదన. అదే నిజమైతే.. ఇతర రాష్ట్రాలనుంచి వస్తున్న ఓటర్లను అడ్డుకుంటే నష్టం ఎవరికి..? ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వారు కచ్చితంగా టీడీపీ కూటమికి ఓటు వేస్తారని ఎలా చెప్పగలం..? అలాంటి వారిని ఏరికోరి ఆర్టీసీ ఎందుకు ఇబ్బంది పెడుతుంది..? అంటే ఇక్కడ నాదెండ్ల లాజిక్ లో పస ఏముంది..? ఓటర్లను అడ్డుకుంటే అది వైసీపీకి కూడా నష్టమైనప్పుడు ఆ పార్టీ చెప్పినట్టల్లా చేస్తుంది అని ఆయన విమర్శిస్తున్న ఆర్టీసీ ఉద్దేశపూర్వకంగా బస్సుల్ని ఎందుకు తగ్గిస్తుంది..? ఈ చిన్న లాజిక్ మిస్ అయిన నాదెండ్ల మనోహర్ ఆర్టీసీపై నోరు పారేసుకుంటున్నారు.

ఆ విషయం తెలియదా..?

రేపు పోలింగ్ అంటే, ఈరోజు పోలింగ్ సిబ్బంది అంతా ఆయా కేంద్రాలకు చేరుకోవాల్సిన పరిస్థితి. దానికి ప్రైవేటు వాహనాలపై ఆధారపడలేం. పోలింగ్ సామగ్రి, సిబ్బందిని తరలించేందుకు ఆర్టీసీ పెద్ద సంఖ్యలో బస్సుల్ని కేటాయించింది. దీంతో సహజంగానే ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్య తగ్గుతుంది. ఈ సంగతి తెలియకుండా నాదెండ్ల రాద్ధాంతం చేయడం మాత్రం ఎన్నికల ముందు హడావిడిలా అనిపిస్తోంది.

First Published:  12 May 2024 12:08 PM GMT
Next Story