Telugu Global
Andhra Pradesh

నమ్మొద్దు, టీడీపీ భుజంపై బీజేపీ తుపాకీ.. చంద్రబాబుకు ముస్లిం మైనారిటీల సెగ

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే కేంద్రంలో బీజేపీకి సీఏఏ, ఉమ్మడి పౌర స్మృతి, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ అమలు చేయడానికి టీడీపీ మద్దతు ఇస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నమ్మొద్దు, టీడీపీ భుజంపై బీజేపీ తుపాకీ.. చంద్రబాబుకు ముస్లిం మైనారిటీల సెగ
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల మద్దతును పూర్తిగా కోల్పోతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ముస్లింలు అంతా ఏకమై టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారానికి తెర తీశారు. టీడీపీకి ముస్లింలు ఓటు వేయకూదని పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ముస్లిం మేధావుల సంఘం పేరు మీద వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింలందరికీ చేరే విధంగా ప్రచారం సాగిస్తున్నారు.

టీడీపీ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలని బీజేపీ చూస్తోందని వారు విమర్శిస్తున్నారు. ‘ముస్లిం సోదరులారా.. మేల్కొనండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అపవిత్రమైన టీడీపీ, జనసేన, బీజేపీ మత తత్వ కూటమికి ఓటు వేయడానికి ముందు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించండి. టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే’ అనే సందేశంతో ఉన్న కరపత్రం వాట్సప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొడుతోంది.

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే కేంద్రంలో బీజేపీకి సీఏఏ, ఉమ్మడి పౌర స్మృతి, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ అమలు చేయడానికి టీడీపీ మద్దతు ఇస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ రద్దవుతుంద‌ని వారంటున్నారు. హలాల్‌ను, లౌడ్‌ స్పీకర్ల ద్వారా హిజాబ్‌, ఆజాలను రద్దు చేస్తారని, వక్ఫ్‌ చట్టం వంటివాటిని కూడా రద్దు చేస్తారని చెప్పుతున్నారు.

పార్లమెంటులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీఏఏకు మద్దతు తెలిపినప్పటికీ చాలా సవరణలు అవసరమని చెప్పి గజెట్‌ నోటిఫికేషన్‌ను వ్యతిరేకించిందని ముస్లిం గ్రూప్‌ వాదిస్తోంది. దీంతో టీడీపీ ముస్లిం మైనారిటీల మద్దతును పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో చేతులు కలిపామనే చంద్రబాబు వాదనను విశ్వసించేది లేదని ముస్లిం మైనారిటీ గ్రూప్‌ అంటోంది.

First Published:  21 March 2024 3:34 PM IST
Next Story