పవన్ కి ఓటు వేస్తే.. పిఠాపురం వాసులు సినిమాలు చూడాల్సిందే
చంద్రబాబు తన ఎస్టేట్‌కు జనరల్ మేనేజర్ గా పవన్ ని పెట్టుకున్నారని, మార్కెటింగ్ మేనేజర్ పోస్టును కూడా పవన్ కే ఇచ్చేశారని, మొత్తం కాపులందర్నీ గంపగుత్తగా కొనేయడానికి పవన్‌కు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు ముద్రగడ.
పవన్ కల్యాణ్ కి ఓటు వేస్తే.. పిఠాపురం వాసులకు సినిమాలు మాత్రమే చూపిస్తాడని ఎద్దేవా చేశారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి పిఠాపురం వచ్చి హలో అని వెళ్లిపోతాడని, నియోజకవర్గానికి ఆయన వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. స్థానికంగా ఉండి, మనకోసం పనిచేసేవారినే ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీత, కాకినాడ ఎంపీగా సునీల్‌ను గెలిపించుకోవాలని అన్నారు. సీఎం జగన్ దృష్టిలో పిఠాపురం మొదటి స్ధానంలో ఉండేలా కష్టపడి పని చేయాలని అన్నారు ముద్రగడ.
పవన్ కల్యాణ్ ప్రజా సేవకోసం రాజకీయాల్లోకి రాలేదని, ఆయన సినిమాల్లో సంపాదించుకున్నారని, రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ సంపాదించేందుకు, మధ్య మధ్యలో సినిమాల్లో నటించేందుకే ఎమ్మెల్యే పదవిపై ఆశపడ్డారని విమర్శించారు ముద్రగడ. పవన్ ని ఓడిస్తే జీవితంలో సినిమావాళ్లు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు సాహసం చేయరని అన్నారు. జనసేన టికెట్ పై పోటీ చేసే అభ్యర్థులకు కూడా పవన్ టచ్ లో ఉండటం లేదని, కనీసం ఆయన సెల్ ఫోన్ నెంబర్ కూడా వారికి ఇవ్వలేదని అన్నారు. అలాంటి పవన్ ఇక ప్రజా సేవ ఏం చేస్తారని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ కి చిత్తశుద్ధి ఉంటే.. హైదరాబాద్, విజయవాడలో ఆస్తులు అమ్ముకుని పిఠాపురం వచ్చేయాలని సవాల్ విసిరారు ముద్రగడ. చంద్రబాబు తన ఎస్టేట్‌కు జనరల్ మేనేజర్ గా పవన్ ని పెట్టుకున్నారని, ఆ పోస్ట్ తో పాటు మార్కెటింగ్ మేనేజర్ పోస్టును కూడా పవన్ కే ఇచ్చేశారని అన్నారు. మొత్తం కాపులందర్నీ గంపగుత్తగా కొనేయడానికి పవన్‌కు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఆ రెండు ఉద్యోగాలు తప్ప పవన్ కి ప్రజా సేవ చేయాలని లేదన్నారు ముద్రగడ.