ముద్రగడ చేరిక వాయిదా.. కారణం ఏంటంటే..?
ర్యాలీకోసం అందరూ ఉత్సాహంగా సమాయత్తమవుతున్న వేళ.. ఇలాంటి సమాచారం ఇస్తున్నందుకు తనని క్షమించాలని కోరారు ముద్రగడ.
వైసీపీలో ముద్రగడ చేరిక వాయిదా పడింది. ఈనెల 14న ఆయన తన అనుచరులతో సహా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాల్సి ఉంది. ఈమేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో అనుచరులు వాహనాల్లో తరలి రండి, ఎవరి భోజనాలు వారే తెచ్చుకోండి అంటూ ఆమధ్య ముద్రగడ ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. అయితే అనూహ్యంగా ఆయన మళ్లీ తన అనుచరులకు మరో లేఖ రాశారు. చేరిక వాయిదా పడిందని సమాచారమిచ్చారు.
సెక్యూరిటీ ఇబ్బందుల వల్లనే..
కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరాలని అనుకున్నారు ముద్రగడ పద్మనాభం. ర్యాలీకి సంబంధించి అధికారులకు పలు వివరాలు కూడా అందించారు. అయితే ఊహించని రీతిలో చాలామంది ర్యాలీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. అంతమంది ఒకేసారి వస్తే సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే ర్యాలీని రద్దు చేసుకున్నట్టు తెలిపారు ముద్రగడ. ఈనెల 15 లేదా 16 తేదీల్లో తనతోపాటు తన ఫ్యామిలీ మాత్రమే తాడేపల్లికి వెళ్తున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో తాము వైసీపీలో చేరుతామని స్పష్టం చేసారు.
క్షమించండి..
ర్యాలీకోసం అందరూ ఉత్సాహంగా సమాయత్తమవుతున్న వేళ.. ఇలాంటి సమాచారం ఇస్తున్నందుకు తనని క్షమించాలని కోరారు ముద్రగడ. అందర్నీ నిరుత్సాహపరచడం తన ఉద్దేశం కాదని, అయితే సెక్యూరిటీ కారణాల వల్ల ర్యాలీని విరమింపజేసుకుంటున్నానని అన్నారు. అందరి ఆశీస్సులు తనకు కావాలని తాజా లేఖలో కోరారు ముద్రగడ.