పవన్ కల్యాణ్ పేరెత్తావో..? ముద్రగడపై జనసేన అస్త్రం
తండ్రిపై కుమార్తె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పేరు పద్మనాభరెడ్డిగా మారినా, ఆయన ఆలోచనా విధానం మాత్రం మారలేదన్నారు క్రాంతి.
పేరు మార్పు తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన ముద్రగడ పద్మనాభం నేరుగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేశారు. తనను బూతులు తిట్టించడం ఆపి, ముందు కాపు రిజర్వేషన్ సంగతి తేల్చాలని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పవన్ చెప్పినట్టు వింటాయని, ఇలాంటి అవకాశం ఉన్న సమయంలోనే కాపులకు న్యాయం చేయాలన్నారు ముద్రగడ. అయితే ఈ ప్రశ్నలు జనసేనకు నచ్చలేదు, వెంటనే ఆయనపై ఆయన కుమార్తెనే అస్త్రంగా ప్రయోగించారు. పవన్ ని ప్రశ్నిస్తావా నాన్నా.. అంటూ ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి ఓ ఘాటు ట్వీట్ వేశారు. తండ్రి ఇక ఇంటికి పరిమితం అయి విశ్రాంతి తీసుకోవాలని హితవు పలికారు.
మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని ,అయన అలోచానా విదానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉన్నది.
— Kranthi Barlapudi (@kr_barlapudi) June 21, 2024
జగన్ మోహన్ రెడ్డి గార్ని ఏనాడూ ప్రశ్నించని అయన , పవన్ కళ్యాణ్ గార్ని ప్రెశ్నించే అర్హత ఆయనకు ఉందా?
ఒకసారి,…
ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తన భర్తతో సహా పవన్ కల్యాణ్ ని కలిశారు, జనసేనకు జై కొట్టారు. తండ్రి వైసీపీకి మద్దతు తెలపగా, కుమార్తె క్రాంతి జనసేన గెలవాలని కోరుకున్నారు. అప్పట్లో తన కుమార్తె తన ఆస్తి కాదంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మళ్లీ ఇప్పుడు ఆ సంవాదం మొదలైంది. తండ్రిపై కుమార్తె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పేరు పద్మనాభరెడ్డిగా మారినా, ఆయన ఆలోచనా విధానం మాత్రం మారలేదన్నారు క్రాంతి.
ఆ అర్హత ఎక్కడిది..?
గతంలో జగన్ ని ఏనాడూ ప్రశ్నించని ముద్రగడ.. ఇప్పుడు పవన్ కల్యాణ్ ని ప్రశ్నించడమేంటని నిలదీశారు క్రాంతి. జగన్ ని ప్రశ్నించలేని తన తండ్రికి ఇప్పుడు పవన్ ని ప్రశ్నించే అర్హత ఎక్కడిదన్నారు. పేరు కూడా మార్చుకున్నాక కాపుల గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని అడిగారు. సమాజానికి ఏం చేయాలనే విషయంలో పవన్ కల్యాణ్‌కు స్పష్టత ఉందని, తన తండ్రికి మాత్రం లేదనిపిస్తోందని చెప్పారు. తన తండ్రి శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దఫా పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటించాల్సి వస్తుందని తన ట్వీట్ లో పేర్కొన్నారు క్రాంతి.