ప్రజల సొమ్ముతో టీడీపీ ప్రచారం.. అన్న క్యాంటీన్లపై విజయసాయి ట్వీట్
అన్న క్యాంటీన్ల వల్ల ప్రయోజనం కంటే టీడీపీ ప్రచారమే ఎక్కువైందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.
సూపర్ సిక్స్ సంగతేంటి అని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంటే.. అన్న క్యాంటీన్ తో సరిపెట్టుకోండి అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో నాలుగు చోట్ల క్యాంటీన్లు పెడితే ఏపీ ఆకలి తీరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు సేకరించడం మరో విశేషం. ఈ విరాళాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ప్రజల సొమ్ముతో టీడీపీ ప్రచారం ఏంటని ఆయన మండిపడ్డారు.
First pay tax, then pay for food at TDP Govt. Anna Canteen and now @ncbn wants you to donate for it also! How is this fair for the people of AP if they are paying for their food but being forced to see @ncbn’s posters everywhere? It is a TDP promotion with people’s money.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 18, 2024
ఎక్కడ చూసినా అన్న క్యాంటీన్ పోస్టర్లే కనపడుతున్నాయి. మీడియా, సోషల్ మీడియా అంతా అన్న క్యాంటీన్ల వీడియోలు, అక్కడ తినేవారి దీవెనలతోనే సరిపోతోంది. నియోజకవర్గానికి ఒక క్యాంటీన్ కూడా పెట్టకుండా ఏపీలో నిరుపేదల ఆకలి మొత్తం అన్న క్యాంటీన్లతో తీరిపోతున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ప్రతిపక్షం మండిపడుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తకిర ట్వీట్ వేశారు. టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లకు విరాళాలు సేకరిస్తోందని.. ఆ విరాళాలకు డబ్బులిచ్చేవారు ముందు పన్ను సక్రమంగా చెల్లించాలని సూచించారు. అసలు ఈ క్యాంటీన్ల వల్ల ఏపీ ప్రజలకు ఏమేరకు న్యాయం జరుగుతోందని విజయసాయి ప్రశ్నించారు.
అన్న క్యాంటీన్లతో మంచి జరిగిందా, ఇక ముందు కూడా అవి ఇలాగే కొనసాగుతాయా, నాణ్యత మెయింటెన్ చేస్తారా..? అనే విషయాలను పక్కనపెడితే టీడీపీ ఈ పథకానికి ఎక్కడలేని ప్రచారం ఇవ్వడం విశేషం. పెయిడ్ ఆర్టిస్ట్ లతో చంద్రబాబుతో మాట్లాడించి దొరికిపోయినా కూడా తగ్గేది లేదంటున్నారు టీడీపీ నేతలు. అన్న క్యాంటీన్ల వద్ద తినేవాళ్ల ముందు మైక్ పెట్టించి చంద్రబాబుని పొగిడిస్తూ, జగన్ ని తిట్టిస్తున్నారు. ఆ పథకం వల్ల ప్రయోజనం కంటే టీడీపీ ప్రచారమే ఎక్కువైందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.