Telugu Global
Andhra Pradesh

అహంకారం నిండా ఆవరించింది.. గుణపాఠం తప్పదు

ఎన్నికల తర్వాత నారాయణ పీడకలలు కంటారని, ఈ ఎలక్షన్‌తో ఆయన రాజకీయ చరిత్ర ముగుస్తుందని హెచ్చరించారు విజయసాయిరెడ్డి.

అహంకారం నిండా ఆవరించింది.. గుణపాఠం తప్పదు
X

మాజీ మంత్రి నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారాయణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి. నెల్లూరు సిటీలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖలీల్ ను నారాయణ తక్కువ చేసి మాట్లాడారని, దానికి ఫలితం అనుభవిస్తారని మండిపడ్డారు. "నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు, అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది. మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు.. అదే మాట మీద ఉండు, రెండు వారాలైతే రోజుకు వందసార్లు ఖలీల్ పేరు కలవరిస్తావం"టూ హెచ్చరించారు విజయసాయిరెడ్డి.

నారాయణకు ఓటమి తప్పదని అన్నారు విజయసాయిరెడ్డి. ఎన్నికల కౌంటింగ్ రోజున ఖలీల్ ఇంత భారీ మెజారిటీతో గెలిచాడా అని నారాయణ నోరెళ్లబెట్టాల్సి వస్తుందని చెప్పారు. దళితులు, బీసీలు, మైనార్టీలు, పేదలంటే ఆయనకు నారాయణకు అసహ్యమనే విషయం రుజువైందని, విజ్ఞులైన నెల్లూరు ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పకుండా వదలరని అన్నారు. ఎన్నికల తర్వాత నారాయణ పీడకలలు కంటారని, ఈ ఎలక్షన్‌తో ఆయన రాజకీయ చరిత్ర ముగుస్తుందని హెచ్చరించారు విజయసాయిరెడ్డి.

నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్థానికంగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తన పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ ఆయన చుట్టేస్తున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ తరపున గట్టిపోటీదారుగా ఉన్న నారాయణకు తాజాగా వార్నింగ్ ఇచ్చారు విజయసాయి.

First Published:  31 March 2024 1:29 PM IST
Next Story