Telugu Global
Andhra Pradesh

దేశంలో సైనిక కంటోన్మెంట్లు రద్దు.. విజయసాయి హర్షం

దేశవ్యాప్తంగా మొత్తం 62 మిలట్రీ కంటోన్మెంట్ల పరిధిలో 1.61 లక్షల ఎకరాల భూమి ఉంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కోటిన్నర ఎకరాలకు పైగా ఉన్న కంటోన్మెంట్ భూములు ఇకపై ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి.

దేశంలో సైనిక కంటోన్మెంట్లు రద్దు.. విజయసాయి హర్షం
X

దేశంలోని సైనిక కంటోన్మెంట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రక్షణ శాఖకు దేశంలో 17.99 లక్షల ఎకరాల భూమి ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 62 మిలట్రీ కంటోన్మెంట్ల పరిధిలో 1.61 లక్షల ఎకరాల భూమి ఉంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కోటిన్నర ఎకరాలకు పైగా ఉన్న కంటోన్మెంట్ భూములు ఇకపై ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి.

అప్పట్లో ఈస్టిండియా కంపెనీ పాలన కోసం..

ఈస్టిండియా కంపెనీ పాలన కోసం అప్పట్లో కంటోన్మెంట్ బోర్డులు ఏర్పాటు చేశారు. అప్పటి కలకత్తా సమీపంలోని బ్యారక్‌ పూర్‌ వద్ద తొలి సైనిక కంటోన్మెంటును 1765 జులై 10న ఏర్పాటు చేశారు. బ్రిటిష్‌ సైనికులు స్థానిక జనంతో కలిసిపోకుండా, తమ సైనిక సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఈ కంటోన్మెంట్లను ఏర్పాటుచేశారు. సైనిక కార్యాలయాలు, ఆయుధాగారాలు, పరేడ్‌ గ్రౌండ్లు, ఆటస్థలాలు, స్కూళ్లు, కాలేజీలు, భవిష్యత్తు ఆర్మీ అవసరాల కోసం ఉంచుకున్న స్థలాలు ఇందులో భాగం. దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి 56 కంటోన్మెంట్లు ఉండగా, 1962లో అజ్మేర్‌ నగరంలో చివరి కంటోన్మెంటు నెలకొల్పారు.

ఇప్పుడెందుకు రద్దు చేశారంటే..?

అప్పట్లో కంటోన్మెంట్లు ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు ఆ స్థలాలు సైన్యం అధీనంలోనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయా కంటోన్మెంట్లలో రోడ్లను సైతం సాధారణ ప్రజలు ఉపయోగించుకోకుండా ఆంక్షలు విధించేవారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో అలజడి చెలరేగేది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కంటోన్మెంట్ ప్రాంతాలు కూడా సమీపంలోని నగర పాలక సంస్థల్లో కలిపేస్తారు.

ఇక నుంచి కంటోన్మెంట్లను మిలిటరీ స్టేషన్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజలకు నిజంగా శుభవార్త అని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్ బోర్డుల రద్దుతో ఆ ప్రాంతాల్లో నివశించే ప్రజలకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అందించే అన్ని ప్రయోజనాలు సమకూరుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత విలువైన, అవసరమైన ఖాళీ స్థలాలు వేలాది ఎకరాల మేర అందుబాటులోకి వస్తాయన్నారు. ఈమేరకు ఆయన ఫేస్ బుక్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

First Published:  11 May 2023 8:37 PM IST
Next Story