Telugu Global
Andhra Pradesh

వారంతా మీకు ఓట్లేసినవారే పురందేశ్వరి గారూ.. - ఎంపీ విజయసాయిరెడ్డి

కేంద్ర నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అంటున్న పురందేశ్వరి గారూ.. మరి కేంద్రానికి నిధులు రాష్ట్రాల నుంచి కాక ఆకాశం నుంచి వస్తాయా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

వారంతా మీకు ఓట్లేసినవారే పురందేశ్వరి గారూ..  - ఎంపీ విజయసాయిరెడ్డి
X

విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి ఆహుతైన ఘటనలో బాధితులను ఆదుకోవాలన్న ఆలోచన గతంలో అక్కడి నుంచే ఎంపీగా గెలిచిన పురందేశ్వరికి రాకపోవడం దురదృష్టకరమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. అసలు ఈ ఘటనే మీ దృష్టికి రాలేదా పురందేశ్వరి గారూ అంటూ ఆయన ప్రశ్నించారు. గతంలో అక్కడి నుంచి మీరు ఎంపీగా గెలిచారు.. వాళ్లంతా మీకు ఓట్లు వేసినవారే.. వ్యక్తిగతంగానైనా, పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు రాకపోవడం బాధాకరం.. అంటూ ఆయన విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి.. బాధితులకు బోటు విలువలో 80 శాతం ఆర్థిక సాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని గుర్తుచేశారు.

కేంద్రానికి నిధులు ఆకాశం నుంచి వస్తాయా?

కేంద్ర నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అంటున్న పురందేశ్వరి గారూ.. మరి కేంద్రానికి నిధులు రాష్ట్రాల నుంచి కాక ఆకాశం నుంచి వస్తాయా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. మీ నాన్న ఎన్టీఆర్‌ కేంద్రం ఒక మిథ్య అనేవారు.. కానీ, మీరు మాత్రం అంతా రివర్స్‌లో ఉన్నారు.. అవునులే.. తండ్రిని విభేదించిన పార్టీతోనే అంటకాగుతున్నారుగా.. అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు బీజేపీలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీ భజన చేస్తున్నారని ఆయన విమర్శించారు. క్రిమినల్‌ కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్న టీడీపీ జిల్లా నాయకులను పురందేశ్వరి సలహా మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులు పరామర్శించి సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లిందని ఆయన తెలిపారు.

ఎల్లో స్టెరాయిడ్స్‌ ఎక్కించే ప్రయత్నమా డ్రామోజీ?

రాష్ట్రంలో పలుచోట్ల ఈనాడు పత్రికను ఉచితంగా ఇళ్ల ముందు వేస్తున్నారని.. బలవంతంగా ఎల్లో స్టెరాయిడ్స్‌ ఎక్కించే ప్రయత్నమా డ్రామోజీ? అని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. చంద్రబాబు ‘అనుకూల’ మీడియా ఏది రాసినా, చూపినా ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రజల్లో, పాఠకుల్లో ఎల్లో మీడియా పూర్తిగా నమ్మకం కోల్పోయిందని విమర్శించారు.

First Published:  26 Nov 2023 11:23 AM IST
Next Story