Telugu Global
Andhra Pradesh

కర్నాటక ఫలితాలపై విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు..

దేశంలో కర్నాటక ప్రధాన రాష్ట్రమే అయినా, ఆ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని చెప్పలేమంటున్నారు విజయసాయి రెడ్డి. గత అనుభవాలు ఇదే విషయాన్ని రుజువు చేశాయని అన్నారు.

కర్నాటక ఫలితాలపై విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు..
X

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య పరిణతికి అద్దం పట్టాయని అన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఎక్కడా ఎలాంటి కొట్లాటలు లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. అంతే కాకుండా అత్యథిక ఓటింగ్ శాతం కూడా కర్నాటక ఎన్నికల్లో మరో ఆసక్తికర అంశం అన్నారు విజయసాయి రెడ్డి. కర్నాటకలో 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.45 శాతం ఓట్లు పోలవగా, 2018లో 72.1 శాతం, తాజాగా జరిగిన ఎన్నికల్లో 73.19 శాతం పోలింగ్‌ తో ఓటర్లు సరికొత్త రికార్డ్ నెలకొల్పారని చెప్పారు విజయసాయి రెడ్డి.

28 లోక్ సభ స్థానాలతో తమిళనాడు తర్వాత రెండో పెద్ద రాష్ట్రంగా ఉన్న కర్నాటక.. ఆర్థికాభివృద్ధిలోనూ, సంపద సృష్టిలోనూ ముందుందని గుర్తు చేశారు విజయసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ లాగే రాజకీయ చైతన్యం, భిన్న రాజకీయపక్షాల ఉనికి కర్నాటకలో కూడా ఉందన్నారు. అధికార పార్టీలు ఓడిపోయి ప్రతిపక్షాలకు ప్రజలు పట్టం కట్టడం కర్నాటకలో ఆనవాయితీగా వస్తోందని.. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాదిరిగానే కర్నాటకలో కూడా ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్నికల తర్వాత సాఫీగా అధికార బదిలీ జరుగుతోందని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో గత నాలుగు దశాబ్దాలుగా అధికార మార్పిడి సాఫీగా జరగడం.. ప్రజల రాజకీయ చైతన్యానికి, భారత రాజకీయ, ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనంగా భావించవచ్చన్నారు.

ఆ ప్రభావం ఉంటుందా..?

దేశంలో కర్నాటక ప్రధాన రాష్ట్రమే అయినా, ఆ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని చెప్పలేమంటున్నారు విజయసాయి రెడ్డి. గత అనుభవాలు ఇదే విషయాన్ని రుజువు చేశాయని అన్నారు. రాష్ట్రాల్లో జరిగే ప్రాంతీయ ఎన్నికలు అన్ని సమయాల్లో జాతీయ రాజకీయాలను మార్పు దిశగా నడిపించవని చెప్పారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు లాగే గొప్ప రాజకీయ సాంప్రదాయాలు, ప్రజాస్వామ్య పునాదులున్న సముద్రతీర రాష్ట్రం కర్నాటక రాజకీయ సుస్థిరతతో బలోపేతమౌతోందని చెప్పారు విజయసాయి రెడ్డి. పూర్వపు బొంబాయి, మద్రాసు, హైదరాబాద్ సంస్థానంలోని ప్రాంతాలను మైసూరుతో కలిపి కర్నాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా.. రాజకీయంగా, సాంస్కృతికంగా ఆ రాష్ట్రం ఏకరూపత సాధించగలిగిందన్నారు.

1983 నుంచి ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే కర్నాటక అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయని గుర్తు చేసిన విజయసాయి రెడ్డి.. ఎలాంటి రాజకీయ సంక్షోభాలు లేకుండా ప్రజాతంత్ర ప్రక్రియ చక్కగా ముందుకు సాగుతోందని కితాబిచ్చారు. కన్నడ శాసనసభకు జరిగిన 16వ ఎన్నికలు కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లే రీతిలో ప్రశాంతంగా ముగియడం దక్షిణాదికే గర్వకారణం అన్నారు.

First Published:  15 May 2023 7:21 PM IST
Next Story