చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు.. ఆయనకు రాజకీయ జీవితం లేదు
ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని, లోకేష్ రాజకీయాలకు పనికి రాడని చెప్పారు. ఇకపై ఏపీలో టీడీపీ అనేదే ఉండదన్నారు విజయసాయిరెడ్డి.
చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలని, 2024 తర్వాత ఆయనకు రాజకీయ జీవితం లేదని విమర్శించారు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన.. మరోసారి టీడీపీపై నిప్పులు చెరిగారు. క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించి కొన్ని కంపెనీలు వైసీపీకి బాండ్ల రూపంలో నిధులు సమకూర్చాయని చంద్రబాబు చేసిన విమర్శలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు. టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన వారే బెట్టింగ్ కు నిధులు ఇస్తున్నారని ఆరోపించారు.
బీజేపీలో విలీనం..
బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ అయినా చివరకు అందులో విలీనం కావాల్సిందేనన్నారు విజయసాయిరెడ్డి. ఈసారి టీడీపీ కూడా బీజేపీలో విలీనం అవుతుందన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని, లోకేష్ రాజకీయాలకు పనికి రాడని చెప్పారు. ఇకపై ఏపీలో టీడీపీ అనేదే ఉండదన్నారు విజయసాయిరెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో, రాష్ట్రానికి సంబంధించి నిధులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మంచి సంబంధాలు కొనసాగించామని వివరణ ఇచ్చారాయన.
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో తమదే విజయం అన్నారు విజయసాయిరెడ్డి. నెల్లూరు సిటీలో పోటీ ఆసక్తికరంగా ఉందని చెప్పారాయన. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీకి మెజార్టీ పెరుగుతుందన్నారు. ప్రజల గుండెల్లో వైసీపీ ఉందని చెప్పారు. గడచిన ఐదు సంవత్సరాల్లో, ప్రజల మనసుల్లో నిలిచిపోయే పనులు సీఎం జగన్ చేపట్టారని అన్నారు విజయసాయిరెడ్డి.