వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా
తన భార్య వేమిరెడ్డి ప్రశాంతికి నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి కోరారు. అనిల్‌కుమార్ యాదవ్‌ను నరసరావుపేట ఎంపీగా పోటీకి పంపిన జగన్ ఆయన స్థానంలో ఎండీ ఖలీల్‌ను ఇన్‌ఛార్జిని చేశారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభకు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు జగన్‌కు లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
అభ్యర్థుల ఎంపికపై కినుక
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఆ స్థానంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని రూరల్ ఇన్‌ఛార్జిగా పంపారు. దీంతో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని పోటీలో నిలపాలని జగన్ నిర్ణయించారు. ఆ మేరకు నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే క్యాండిడేట్లను తనకు అనుకూలమైనవారిని పెట్టాలని ఆయన పట్టుబడుతుండటం పార్టీకి నచ్చలేదు.
భార్యకు టికెట్ ఇవ్వలేదని అలక
తన భార్య వేమిరెడ్డి ప్రశాంతికి నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి కోరారు. అయితే అక్కడ సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను నరసరావుపేట ఎంపీగా పోటీకి పంపిన జగన్ ఆయన స్థానంలో ఎండీ ఖలీల్‌ను ఇన్‌ఛార్జిని చేశారు. దీంతో వేమిరెడ్డి పార్టీకి మరింత దూరంగా జరిగారు. అప్పటి నుంచే ఆయన పార్టీకి రిజైన్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అది ఈ రోజు నిజమైంది.