ఈ ఎంపీకి ఎంత గతిపట్టింది
గతంలో ఒక కేసులో అరెస్టుచేసిన సీఐడీ తనను చితకొట్టిందని రాజు తన పిటీషన్లో ప్రస్తావించారు. ఏపీలోకి అడుగుపెట్టాలంటేనే అదనపు ప్రొటెక్షన్ కావాలని ప్రతిసారి కోర్టులో కేసు వేయటం మామూలైపోయింది.
ఎవరైనా విదేశాలకు వెళ్ళాలంటే వీసా అవసరం. అందుకు కొంత ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సుంటుంది. అయితే దేశంలో ఎవరు ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చు ఎలాంటి అడ్డుండదు, అనుమతులూ అవసరంలేదు. కానీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మాత్రం పెద్ద కష్టమే వచ్చింది. ఢిల్లీలో కూర్చుని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లటమే టార్గెట్‌గా రోజులు వెళ్ళదీస్తున్నారు. అలాంటి రాజుగారు ఏపీ హైకోర్టులో ఒక పిటీషన్ వేశారు.
అదేమిటంటే.. సంక్రాంతి పండుగకు తన సొంతూరుకు వెళుతున్న కారణంగా తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఆయనకు ప్రస్తుతం ఎంపీ హోదాలో సెక్యూరిటీ ఉంటుంది. అయితే అది సరిపోదు కాబట్టి తనకు అదనపు రక్షణ కల్పించాలని పిటీషన్‌లో అభ్యర్థించారు. తనపై ఇప్పటికే ప్రభుత్వం 11 కేసులు నమోదుచేసిందని, తనపై మరో తప్పుడు కేసుపెట్టి అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు భయపడుతున్నారు. అందుకనే అదనపు రక్షణ కోరుతున్నట్లు చెప్పారు.
గతంలో ఒక కేసులో అరెస్టుచేసిన సీఐడీ తనను చితకొట్టిందని రాజు తన పిటీషన్లో ప్రస్తావించారు. ఏపీలోకి అడుగుపెట్టాలంటేనే అదనపు ప్రొటెక్షన్ కావాలని ప్రతిసారి కోర్టులో కేసు వేయటం మామూలైపోయింది. అదనపు భద్రతలేనిదే రాష్ట్రంలో తిరగలేని పరిస్థితులు రాజే కొని తెచ్చుకున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని బాగా గోకిగోకి కోర్టుల్లో కేసులు వేశారు. బెయిల్ రద్దుచేయించి జగన్ను జైలుకు పంపటమే లక్ష్యంగా రాజు కేసులు వేశారు. అయితే వాటిల్లో చాలావాటిని కోర్టులు కొట్టేశాయి. అయినా రాజు పంతం నెగ్గించుకోవటానికి కేసులు వేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తాను దొరికితే సీఐడీ లేదా మామూలు పోలీసులు వదిలిపెట్టరనే భయం రాజులో పెరిగిపోతున్నట్లుంది. సంక్రాంతి పండుగకు కోళ్ళపందేలు నిర్వహించటం గోదావరి జిల్లాల్లో ప్రత్యేకించి భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో హోదాకు నిదర్శనం. అందుకనే రాజు నరసాపురానికి రావాలని కోరుకుంటున్నారు. ఇంత భయపడే వ్యక్తి అసలు జగన్ తో ఎందుకు వైరం పెట్టుకోవాలి..? రేపటి ఎన్నికల్లో స్వేచ్ఛగా ఎలా ప్రచారం చేసుకోగలరో అర్థంకావటంలేదు.