'సముచిత స్థానం'.. ముద్రగడకు గట్టి హామీ లభించినట్టేనా..?
సీఎం జగన్ ఆదేశాల మేరకు ముద్రగడను కలిశానని చెప్పారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించామన్నారు.
వైసీపీ నుంచి రాయబారం పూర్తయింది. ఇప్పుడు బంతి ముద్రగడ కోర్టులో ఉంది. ముహూర్తం ఆయన ఇష్టం, ఇటువైపు వస్తే వైసీపీ నుంచి ఎలాంటి గౌరవం ఇస్తారనే సమాచారం ఆల్రడీ ముద్రగడకు చేరిపోయింది. మిగిలింది కండువా లాంఛనమే. ముద్రగడను ఇంటికి వెళ్లి కలసి వచ్చారు వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జగన్ మాటగా మిథున్ రెడ్డి ఆయకు భరోసా కల్పించారు. పార్టీలో చేరితే సముచిత స్థానం దక్కుతుందని చెప్పారు.
వైసీపీతో ముద్రగడ కలయిక టీడీపీ-జనసేన కూటమికి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. కాపు ఓట్లు వన్ సైడ్ గా పవన్ కల్యాణ్ తో తమవైపు వస్తాయనుకున్న చంద్రబాబు.. ముద్రగడను తక్కువ అంచనా వేశారు. కించపరిచినా కిక్కురుమనకుండా ఉంటారనుకున్నారు. కానీ ఆయన వైసీపీవైపు అడుగులు వేశారు. దీంతో చంద్రబాబు షాకయ్యారు. ఇప్పుడిక పరిస్థితి చేయిదాటిపోయిందనే చెప్పాలి. ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. మరి ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎన్నికల బరిలో ఉంటారా, లేక పరోక్ష రాజకీయాలు చేస్తారా అనేది మాత్రమే తేలాల్సి ఉంది.
సీఎం జగన్ ఆదేశాల మేరకు ముద్రగడను కలిశానని చెప్పారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించామన్నారు. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాపు రిజర్వేషన్ల కోసం గొప్ప ఉద్యమం చేసిన నేత ముద్రగడ అని అన్నారు మిథున్ రెడ్డి. ఆయనకు ఏమైనా ఆఫర్లిచ్చారా అని మీడియా అడుగుతోందని.. ముద్రగడ ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదని అన్నారు. సీఎం జగన్‌కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసునని, ముద్రగడకు ఆయన సముచిత స్థానం ఇస్తారని చెప్పారు మిథున్ రెడ్డి